భువనగిరికలెక్టరేట్, ఆగస్టు 19: చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తు లు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మండలంలోని తాజ్‌పూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన షేక్ జహంగీర్ (52) చేపలు పట్టేందుకు తన స్నేహితుడు భువనగిరికి చెందిన ఎంకర్ల వెంకటేశ్ (48)తో కలిసి గ్రామ సమీపంలోని చిన్నేరు వాగు వద్దకు వెళ్లారు. అకడ వల వేసి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తుండగా వల చికుకుంది.
దీంతో వారిద్దరూ చిక్కుకున్న వలను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు చెక్ డ్యాం నుంచి కింద పడిపోయారు. వరద ఉధృతి నేపథ్యంలో నీటిలో పడిన ఇరువురు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. అనంతరం దవాఖాన వద్ద మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు చేపల వేటకు వెళ్లడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా, కొందరు నిర్లక్ష్యంగా వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
వరదలు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగరాదని, చేపలు పట్టేందుకు వెళ్లి ఎంతోమంది మృతి చెందుతున్నారని, దీంతో వారి కుటుంబాలకు తీరని లోటు మిగులుతుందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా మృతి చెందిన షేక్ జహంగీర్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉండగా, వెంకటేశ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని రూరల్ ఎస్‌హెచ్‌వో అనీల్‌కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.