మిర్యాలగూడ రూరల్, డిసెంబర్18 : నిర్లక్ష్యం, అతివేగం వారి పాలిట శాపంగా మారింది. రెండు బైకులు వేగంగా ఎదురెదుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని దేవరకొండ రోడ్డులో గల శ్రీనివాసనగర్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకున్నది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడవిదేవులపల్లి మండలం బంగారికుంటతండా గ్రామపంచాయతీ శివారు చింతచెట్టుతండాకు చెందిన ముడావత్ సేవానాయక్(27), జగన్ మిర్యాలగూడలో కూలి పని ముగించుకొని బైక్‌పై గ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో తుంగపహాడ్కు చెందిన ఎళ్లబోయిన శంకర్(25) తుంగపహాడ్ నుంచి మిర్యాలగూడకు వస్తుండగా శ్రీనివాసనగర్ వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రమాదంలో సేవానాయక్, శంకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. జగన్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. సేవా, శంకర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తరళిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
సేవానాయక్ భార్య గర్భిణి..
మృతుల్లో సేవానాయక్కు వివాహం కాగా భార్య గర్భిణి. తండ్రి అవిటివాడు. కూలి చేస్తూ తల్లిదండ్రులు, భార్యను పోషిస్తున్న సేవానాయక్ ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రులు ఆసరా కోల్పోయారు.