– 104.5 కేజీల గంజాయి, ఒక లారీ, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నీలగిరి, మే 09 : గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి వారి నుండి 104.5 కేజీల గంజాయి, ఒక లారీ, రెండు సెల్ ఫోన్లను నల్లగొండ పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్‌కు భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం రావడంతో కేతేపల్లి ఎస్ఐ సతీష్ పోలీసు సిబ్బంది, క్లూస్ టీమ్‌తో కలిసి కొర్లపహాడ్ టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గ్రీన్ కలర్ అశోక్ లేలాండ్ లారీ నంబర్ HP-38-F-3447ను ఆపి తనిఖీ చేయబోతుండగా లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాహనం దిగి పారిపోవడానికి ప్రయత్నించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సోదాలు జరుపగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయన్నారు. నిందితులను జమ్ముకాశ్మీర్‌కు చెందిన పరంవిర్ సింగ్ @ లంబుగా, మహారాష్ట్రకు చెందిన షా ఆలం పర్వేష్ ఆలం అన్సారిగా గుర్తించినట్లు తెలిపారు. అంతర్ రాష్ట్ర మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, నకిరేకల్ సీఐ హరిబాబు, కేతేపల్లి ఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బంది బి.వెంకటేశ్వర్లు, బి.వెంకట కృష్ణ, స్వామి, వెంకన్న, బాసిత్‌లను ఎస్పీ అభినందించారు.

అంతర్ రాష్ట్ర గంజాయి రవాణాదారులు ఇద్దరు అరెస్ట్