– వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేట టౌన్. నవంబర్ 12 : ఖరీదైన బైకులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కె.నరసింహ కేసు వివరాలను వెల్లడించారు. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న చిలుకూరు మండలంలోని కట్ట కొమ్ముగూడెం గ్రామానికి చెందిన వేమూరి కృష్ణ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడెం గ్రామానికి చెందిన రేఖల శివకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. సూర్యాపేట రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ సురేశ్ తన టీం తో వాహనాలు తనిఖీ చేస్తున్నాడు. ఆ సమయంలో బైక్‌పై ఓ వ్యక్తి అనుమానాస్పద కదలికలతో వెళ్తుండగా అతడిని ఆపి తనిఖీ చేశారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టం ద్వారా అతడి వేలిముద్రలు తనిఖీ చేయగా వేమూరి కృష్ణపై సుమారు 50 బైక్ దొంగతనాల కేసులు ఉన్నట్లు గుర్తించారు.
అదుపులోకి తీసుకుని విచారించగా సూర్యాపేట పట్టణం, ఖమ్మం, మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఖరీదైన బైక్‌లే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసినట్లుగా తేలింది. మొత్తం 26 మోటారు సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. 06 మోటారు సైకిల్ లను మరో నిందితుడు శివకుమార్ తో కలిసి దొంగిలించినట్లు తెలిపాడు. అపహరించిన 26 బైక్‌ల్లో ఒక బైక్‌ను కృష్ణ తన వద్ద ఉంచుకుని, మిగిలిన 25 మోటారు సైకిళ్లను రేఖల శివకుమార్ వద్ద ఉంచాడు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సెక్యూరిటి గార్డ్ పనిచేస్తూ, చుట్టుప్రక్కల వారికి బ్యాంక్ వాహనాల రికవరి ఏజెంట్‌గా పని చేస్తున్నానని చెప్పుకుంటూ, వారిని మభ్యపెడుతూ 04 మోటారు సైకిళ్లను అతడికి తెలిసిన నకిరేకల్ మండలంలోని వారికి అమ్మాడు. మిగిలిన 21 మోటారు సైకిళ్లను ఎవరికైనా అమ్ముదామని అతని ఇంటివద్దనే ఉంచుకున్నాడు. నిందితుల వద్ద నుంచి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
వేమూరి కృష్ణ భార్యాపిల్లలను వదిలేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. పట్టణాల్లో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు పార్కింగ్ చేసిన ఖరీదైన ద్విచక్ర వాహనాలను రెక్కీ చేసి దొంగలించి రేఖల శివకుమార్ ద్వారా ఇతరులకు అమ్మి లాభం గడించేవాడన్నారు. ఇప్పటికే పలుమార్లు దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించి విడుదలై మళ్లీ దొంగతనాలు చేసేవాడని తెలిపారు. నిందితుల వద్ద నుండి సూర్యాపేట టూ టౌన్లో 06, మిర్యాలగూడ వన్ టౌన్లో 09, మిర్యాలగూడ టూ టౌన్లో 05, ఖమ్మం వన్ టౌన్లో 02, ఖమ్మం టూ టౌన్లో 04 చొప్పున దొంగలించిన మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ సురేశ్ పాల్గొన్నారు.

Suryapet Town : సూర్యాపేటలో బైక్ దొంగలు ఇద్దరు అరెస్ట్.. 26 బైకులు స్వాధీనం