దామరచర్ల, మార్చి 28 : రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఔట్ సోర్సింగ్ జేఏసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శనివారం నల్లగొండ జిల్లా దామరచర్లలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏజెన్సీల దోపిడీకి గురవుతూ, వివిధ రకాలుగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి “సమాన పనికి సమాన వేతనం” అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వీరనాయక్, రాజేశ్ నాయక్, శ్రీను నాయక్, రమేశ్ పాల్గొన్నారు.