మునుగోడు, మే 20 : గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారులు వేధింపులు ఆపాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగూరి నర్సింహ అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆర్ఎంపీ వైద్యులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ఏర్పాటు చేసుకున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై టీఎంసీ బృందాలు దాడులు చేస్తూ కేసులు నమోదు చేయడం బేషరతుగా విరమించుకోవాలన్నారు.
ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరలుగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆర్ఎంపీలను వేధించడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, సబ్ సెంటర్లను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ఒత్తిళ్లకు లొంగిన అధికారులు ఆర్ఎంపీలపై దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఎంపీల సంఘం మండల గౌరవ అధ్యక్షుడు నలపరాజు వెంకన్న, మునుగోటి దయాకర్, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీనివాసులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు బోమ్మరగోని లాలయ్య, మాజీ జడ్పీటీసీ లింగయ్య, మండల సహాయ కార్యదర్శి యాదయ్య, మండల కార్యవర్గ సభ్యులు దుబ్బ వెంకన్న, ఎండీ జానీ పాల్గొన్నారు.