మర్రిగూడ, అక్టోబర్ 22 : మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని సీఎం కేసీఆర్ ఇన్చార్జి గ్రామం లెంకలపల్లిలో నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యాపారులకు అంటగడుతున్న బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాజగోపాల్‌రెడ్డికి మతిస్థిమితం లేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ అదే పదవికి పోటీ చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మూడున్నరేండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తాడో సమాధానం చెప్పి ఓట్లు అడగాలన్నారు. మునగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని నడిబజారులో రూ.18 వేల కోట్లకు బీజేపీకి తాకట్టు పెట్టిన రాజగోపాల్‌రెడ్డికి ఈ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మునుగోడు ప్రజలు తెలివైన వారని, రాజగోపాల్‌రెడ్డి మోసాలను గమనిస్తున్నారని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తేనే మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పాక నగేశ్‌యాదవ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రేణుకావెంకన్నగౌడ్, వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట హరికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వడ్డెర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.