చౌటుప్పల్ రూరల్/చిట్యాల, ఫిబ్రవరి 15 : కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా ఏ ఒక్క వర్గానికీ సంక్షేమ పథకాలు అందడం లేదని, ఇది పూర్తిగా సంక్షోభ ప్రభుత్వంగా మారిపోయిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు . ఖమ్మంలో బీసీ నాయకులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంతోపాటు ఇతర కార్యక్రమాలతో పాల్గొనడానికి వెళ్తున్న కవితకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చిట్యాలలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కవితను స్వాగతించి పూల మాలలు, శాలువాలతో సన్మానించారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో కవితకు గొర్రె పిల్లను బహూకరించారు. ఈ సందర్భంగా కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ రైతులకు న్యాయం చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకత్వంలో రైతులకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తామని తెలిపారు. స్వాగతం పలికిన వారిలో చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, నాయకులు గిర్కటి నిరంజన్ గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, బొళ్ల శివకుమార్, ఢిల్లీ మాధవరెడ్డి, మాచర్ల కృష్ణ, ఉడుగు మల్లేశం, చిన్నం బాలరాజు, గడ్డం యాదగిరి, మెరుగు శ్రీనివాస్, రామకృష్ణ, పిల్లలమర్రి సాయి, బీఆర్ఎస్ చిట్యాల పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, నాయకులు కొలను సునిత, కన్నెబోయిన జ్యోతీబలరాం, జడల ఆదిమల్లయ్య, కూరెళ్ల లింగస్వామి, మెండె సైదులు, కొలను సతీశ్, సుంకరి యాదగిరి, బాలగోని రాజు, జిట్ట శేఖర్, ఆగు అశోక్, బందెల రాములు ఉన్నారు.