నల్లగొండ, ఫిబ్రవరి 23 : నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలతో కొంత మంది పంచాయతీ కార్యర్శులపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్‌కు సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్‌తో ఓ ఆర్డర్ జారీ చేస్తూ నియోజకవర్గం వ్యాప్తంగా 12 మందిని బదిలీ చేయించారు. ఒక్క కార్యదర్శికి ఇదే నియోజకవర్గంలో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ మిగిలి వారిని దేవరకొండ, డిండి, చందంపేట, నేరేడుగొమ్ము వంటి దూర ప్రాంతాలకు పోస్టింగ్ ఇచ్చారు.
2019 ఏప్రిల్ 11 నుంచి జూనియర్ పంచాయతీల పోస్టింగులు జరుగగా, మెరిట్‌ను బట్టి కార్యదర్శులుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల స్థాన చలనం లేకున్నప్పటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలతో నల్లగొండ నియోజకవర్గంలో జరుగడం గమనార్హం, ప్రధానంగా గ్రేడ్ -1, గ్రేడ్ -2 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు పంచాయతీ రాజ్ కమిషనర్ పరిధిలో ఉండగా గ్రేడ్ -3, 4 పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కలెక్టర్ పరిధిలో ఉంటాయి. నల్లగొండ నియోజకవర్గంలో దండంపల్లి, చందనపల్లి పంచాయతీ కార్యదర్శులు యాదగిరి, శ్రవణ్ గ్రేడ్ -1 అయినప్పటికీ వారిని బదిలీ చేయడం పలు విమర్శలకు తావిస్తున్నది.
రెడ్డి కాలనీ పంచాయతీ కార్యదర్శి సుజితను కొత్తపల్లికి బదిలీ చేయగా, మిగతా 11 మందిని దేవరకొండ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయడంతో ఆయా కార్యదర్శులు ఆందోళన చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల స్థానంలో ఓపీఎస్ కార్యదర్శులను బదిలీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడైన ఓ రాజకీయ నాయకుడు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పంచాయతీ కార్యదర్శులను ఇక్కడ నియమించి జూనియర్ పంచాయతీ రాత పరీక్షలో మెరిట్ మార్కులు సాధించి నల్లగొండ నియోజకవర్గంలో పోస్టింగులు సాధించిన వారిపై వేటు వేసినట్లు సమాచారం.