చండూరు, సెప్టెంబర్ 29 : చండూర్ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కురుపాటి పరశురామ్ చండూర్ పట్టణంలోని మరియనికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు గుండ్రపల్లి గ్రామం నుండి చండూరు పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజు వాహనదారులను లిఫ్ట్ అడుగుతుంటాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందిన టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి (TOM REDDY) చేస్తున్న సేవలను చూసి ఆయనకు ఫోన్ చేశాడు. కుటుంబ పరిస్థితిని వివరించి పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ కావాలని కోరాడు. వెంటనే స్పందించిన వెంకట్రామ్ రెడ్డి ఆ విద్యార్థికి సైకిల్ కొని సోమవారం అందజేశాడు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డికి పరశురామ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.