సూర్యాపేట, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పటేల్ రమేశ్‌రెడ్డికి పదవి వచ్చింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా సూర్యాపేటలో రమేశ్‌రెడ్డి నివాసం వద్దకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని సంబురాలు చేసుకున్నారు. బొకేలు, శాలువాలు అందించి రమేశ్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. రమేశ్‌రెడ్డి రెండు సార్లు సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కకపోగా పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కచ్చితమైన హామీ ఇచ్చినప్పటికీ చివరలో మరొకరికి కేటాయించారు. దాంతో అసంతృప్తిగా ఉన్న రమేశ్‌రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇవ్వడంతో ఆయనతోపాటు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంతోపాటు జిల్లాలో చాలా టూరిజం ప్రదేశాలు ఉన్నాయని, ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తీసుకురావడంతోపాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకంగా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్పొరేషన్ పదవి తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు భరోసా, ధైర్యం ఇస్తుందని, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటానని తెలిపారు. ఇదిలా ఉంటే సూర్యాపేటలో గత దశాబ్దకాలంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి రెండు వర్గాలుగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించిన విషయం విదితమే. రెండు సార్లు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి దామోదర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి ఒకరంటే మరొకరు కారణమనే భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న దామోదర్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని తన చుట్టూ తిప్పుకుంటుండగా, రమేశ్‌రెడ్డికి ప్రొటోకాల్ ఉండే పదవి రావడంతో ఆయనను అధికారులు కచ్చితంగా కలువాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల మార్కెట్ కమిటీ వేసేందుకు జాబితా సిద్ధం చేయగా నల్లగొండ మార్కెట్ కమిటీకి జీఓ వచ్చినప్పటికీ సూర్యాపేటలో రాకపోవడం పట్ల రెండు వర్గాలుగా ఉండడమే కారణమని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యాపేటలో ప్రొటోకాల్, నాన్ప్రొటోకాల్ రెండు గ్రూపుల మధ్య సఖ్యత ఉండేనో లేక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.