యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికలు తుది అం కానికి చేరాయి. బుధవారం ఐదు మండలా ల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒం టి గంట వరకు పోలింగ్ జరగనుంది. భోజన సమయం అనంతరం ఓట్లను లెక్కిస్తారు. ఫలితాల అనంతరం విజేతలకు ధ్రువీకరణ పత్రా లు అందిస్తారు.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మూడో విడతలో చౌటుప్పల్, నారాయణపురం, మోటకొండూరు, గుండాల, మోత్కూ రు, అడ్డగూడూరు మండలాల్లో పోలింగ్ జరగనుంది. 124 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేయగా..10 సర్పంచ్ స్థానాలు, 93 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 114 సర్పంచ్ పదవులకు 338 మంది, 993 వార్డు పదవులకు 2395 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సుమారు 3513 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వీరిలో 119 రిటర్నింగ్ అధికారులు, 1056 ప్రిసైడింగ్ అధికారులు, 1256 ఇతర ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారు. మంగళవారం మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి 93 బస్సుల్లో సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకొని పంచాయతీలకు తరలించారు.
మూడో విడత పోలింగ్లో మొత్తం 1,62,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 80,742 పురుషులు, 81,281 మహిళలు ఉన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో అత్యధికంగా 40112 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత వరుసగా చౌటుప్పల్ మండలంలో 38,501, గుండాలలో 260 69, అడ్డగూడూరులో 23022, మోటకొండూరులో 21103, మోత్కూరులో 13515 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. తొమ్మిది కేంద్రాలను అతి సున్నితమైన, 45 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. తొమ్మిది కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు నియమించి.. వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. అభ్యర్థులు, ఏరియాను బట్టి ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల వరకు పంపిణీ చేస్తున్నారు.
మఠంపల్లి, డిసెంబర్ 16 : మండలంలోని బక్కమంతులగూడెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మూడో విడత పోలింగ్ నేపథ్యంలో గ్రామంలో పోటీ చేస్తున్న రెబల్ అభ్యర్థి, వార్డు సభ్యులను సోమవారం రాత్రి సమయంలో పోలీసులు ఏ కారణం లేకుండా తీసుకెళ్లి ఉదయం వరకు వదిలిపెట్టకపోవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వతంత్ర అభ్యర్థిని టార్గెట్ చేస్తూ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతిసారి గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఈసారి ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పోలీసు పహారా ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. మంగళవారం రామచంద్రాపురం, బక్కమంతులగూడెంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని, ఇప్పటికే గ్రామంలో చాలా మందిని బైండోవర్ చేశామన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, హుజూర్నగర్ సీఐ చరమందరాజు, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రామారావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.