తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న 2009 నవంబర్ 29వ తేదీకి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యమాన్ని ములుపుతిప్పిన చారిత్రాత్మక దినంగా చరిత్ర పుటల్లో నిలిచింది. కేసీఆర్ అకుంఠిత దీక్షతో కొనసాగించిన ఆమరణ దీక్షతో అదే ఏడాది డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయక తప్పలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాందిగా భావించే నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ యేటా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్‌కు ఘనంగా ఏర్పాట్లు చేశారు. నేడు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దీక్షా దివస్‌లో భాగస్వాములు అయ్యేందుకు సన్నద్ధమయ్యారు.
నల్లగొండ గడియారం సెంటర్లో బీఆర్ఎస్ దీక్షా దివస్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాది మంది తరలిరానున్న నేపధ్యంలో అందుకు అనుగుణంగా స్థలాన్ని సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగనున్న దీక్షా దివస్‌కు పార్టీలోని అన్ని స్థాయిల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు, అభిమానులు తరలిరానున్నారు. ఇప్పటికే వారం రోజుల నుంచి విస్త్రత ప్రచారం కల్పించారు. దీక్షా దివస్ సందర్భంగా ఆనాటి ఉద్యమ ఘట్టాలను, పోరాట స్ఫూర్తిని మరోసారి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులందరికీ దీని ప్రాధాన్యతను వివరిస్తూ సోషల్ మీడియాలో, పార్టీ పరంగానూ సమాచారం చేరవేశారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఎస్ దీక్షా దివస్ కోసం ప్రత్యేకంగా జిల్లాల వారీగా ఇన్చార్జీలను రంగంలోకి దించారు. వారి ఆధ్వర్యంలో ఈ నెల 26న జిల్లాల వారీగా విస్తృత స్థాయి సన్నాహాక సమావేశాలు నిర్వహించారు.
దీనికి పార్టీ నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దీక్షా దివస్ ఇన్‌చార్జీలతో కలిసి ఉమ్మడి జిల్లాలోని మూడు జిల్లాల సన్నాహాక సమావేశాలకు హాజరయ్యారు. దీక్షా దివస్ ప్రాధాన్యతను వివరిస్తూ దిశానిర్ధేశం చేశారు. ఆనాటి తెలంగాణ ఉద్యమ ఘట్టాలను, కేసీఆర్ త్యాగాలను, పోరాట స్పూర్తిని ఈ తరానికి తెలియపరిచేలా దీక్షా దివస్ జరుగాలని సూచించారు. ఇందులో పెద్ద సంఖ్యలో యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు కేసీఆర్ గొప్పతనాన్ని, పోరాట పటిమను, ఉద్యమ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ మేరకు దీక్షా దివస్ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.
అందుకు అనుగుణంగానే మండలాలు, గ్రామాల వారీగా కూడా తరలివచ్చేలా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉదయం 9గంటల వరకే పార్టీ శ్రేణులంతా ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకునేలా ఆదేశాలిచ్చారు. 10 గంటలకు ప్రారంభించి ఒంటి గంట వరకు కొనసాగేలా దీక్షా దివస్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆనాటి ఉద్యమ ముఖ్య ఘట్టాలతో రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు వీడియాలను ప్రదర్శించనున్నారు. దీక్షా దివస్‌కు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు జిల్లా ఇన్చార్జీ, మాజీ ఎంపీ మన్నెం శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. దీక్షా దివస్‌కు సంబంధించి నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. దీక్షా దివస్ వేదిక, టెంట్లు, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. దీక్షా దివస్‌కు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు భూపాల్‌రెడ్డి తెలిపారు.
భువనగిరిలో..
భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద శుక్రవారం దీక్షా దివస్ చేపట్టనున్నారు.దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమం విజయవంతం చేసేందుకు పలువురు నేతలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. 5వేల మందితో కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. భువనగిరి నియోజకవర్గం నుంచి 2వేల మంది, ఆలేరు నుంచి 1,500, మిగతా మూడు నియోజకవర్గాల్లోని 5 మండలాల నుంచి 1,500 మంది తరలిరానున్నరని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజవర్గాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు బైక్, కార్ ర్యాలీలతో స్వచ్ఛందంగా తరలి రానున్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్సీ, కార్యక్రమం ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరుకానున్నారు. దీక్షా దివస్ ఏర్పాట్లను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గురువారం పరిశీలించారు. సభాస్థలి పనులపై ఆరా తీశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
సూర్యాపేటలో సద్దుల చెరువు వేదిక..
దీక్షా దివస్‌ను పురస్కరించుకొని సూర్యాపేటలో భారీ కార్యక్రమం చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేసింది. స్థానిక బతుకమ్మ ఘాట్ వద్ద 3వేల మందికిపైగా శ్రేణులతో కార్యక్రమం తలపెట్టింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్తోపాటు కార్యక్రమం కో-ఆర్డినేటర్, నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి పాల్గొననున్నారు.
సూర్యాపేటకు దిక్సూచిగా జగదీశ్‌రెడ్డి..
సూర్యాపేట విషయానికి వస్తే 2009లో పిడికెడు మంది ఉద్యమకారులు మాత్రమే ఉన్నా ప్రతి కార్యక్రమం చేపట్టేవారు. నాడు సూర్యాపేటలో సిండికేట్ల రాజ్యం నడుస్తూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. అలాంటిది దీక్షా దివాస్ తరువాత సూర్యాపేటలో నిరంతరాయంగా చేపట్టిన దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ నాయకులు కూల్చి విధ్వంసం సృష్టించగా దాదాపు 15 గంటల పాటు పట్టణం నిర్మానుష్యంగా ఉంది. మరుసటి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉద్యమ నాయకుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు చేరుకొని కూలిన శిబిరం వద్దకు చేరుకుని ఉద్యమకారుల్లో ధైర్యం నింపి పట్టణంలో ర్యాలీకి సిద్ధమయ్యారు. అప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా రోడ్డు పక్కన ఉండి చూసేవారు, ఇండ్లకే పరిమితమైన వారు ఒక్కొక్కరుగా ర్యాలీలో చేరడంతో గంట వ్యవధిలోనే వేలల్లోకి చేరారు. అలా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.
విజయవంతం చేయాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం చేపట్టబోయే దీక్షా దివాస్‌ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ పిలుపునిచ్చారు. కార్యక్రమం చేపట్టనున్న స్థానిక సద్దుల చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ వద్ద స్థలాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఇతర నాయకులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి 3వేలకు మందికిపైగా దీక్షా దివస్‌కు హాజరవుతారని, ఆ మేరకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా నాటి ఉద్యమ సమయంలో చిన్న పిల్లలుగా ఉన్నవారు పెద్ద సంఖ్యలో వచ్చి ఉద్యమ విశేషాలు, నాటి ఉద్యమ ఘట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారాయణరెడ్డి, జీడి భిక్షం, జూలకంటి జీవన్‌రెడ్డి, ఆకుల లవకుశ, చింతలపాటి భరత్ ఉన్నారు.
పెద్దసంఖ్యలో తరలిరావాలి
నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, బీఆర్ఎస్
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు నాంది పడిందని, అలాంటి దీక్షకు పూనుకున్న నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌ను నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆనాటి ఉద్యమ ఘట్టాలను, కేసీఆర్ త్యాగాలను, పోరాట స్పూర్తిని భావితరాలకు అందించడమే లక్ష్యంగా దీక్షా దివస్ కొనసాగుతుందని చెప్పారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే దీక్షా దివస్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్దసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధిలో పదేండ్లల్లోనే దేశానికే దిక్చూచిగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దితే… ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గ పాలనపై తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ఉద్యమించేలా దీక్షాదివస్ జరుగుతుందని స్పష్టం చేశారు.
కేటీఆర్‌ను కలిసిన భగత్
హాలియా, నవంబర్ 28 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించినట్లు భగత్ పేర్కొన్నారు.