తుంగతుర్తి నియోజకవర్గానికి 66 ఏండ్ల చరిత్ర ఉంది. 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించింది. అంతకుముందు సూర్యాపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆది నుంచి కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. 2014లో స్వరాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.6వేల కోట్లతో అభివృద్ధి జరుగడంతో నియోజకవర్గ ముఖచిత్రం పూర్తిగా మారి కొత్తరూపు సంతరించుకున్నది.
గడిచిన 9 ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వలను ఆధునీకరించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగునీటిని అందించడంతో ప్రతి పల్లె పచ్చని మాగాణంగా మారింది. నెర్రెలు బారిన భూమిలో సిరుల పంటలు పండుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇక్కడి ప్రజల జీవన విధానం పూర్తిగా కొత్త పుంతలు తొక్కింది. మిషన్ కాకతీయతో 450 చెరువులకు పూర్వవైభం వచ్చింది. నెర్రెలు బారిన చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి.
నియోజకవర్గంలో రూ.59 కోట్లతో 6 చోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. తిరుమలగిరి, మోత్కూర్‌ను మున్సిపాలిటీలుగా మార్చారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో రూ.5 కోట్లతో పురపాలిక భవనం, రూ.2 కోట్లతో సమీకృత మార్కెట్, రూ.30 కోట్లతో మంచినీటి ట్యాంకు, పైపులైన్ నిర్మాణం, రూ.3 కోట్లతో ఆడిటోరియం, రూ.2 కోట్లతో డంపింగ్‌యార్డు, రూ.3 కోట్లతో సీసీరోడ్లు, రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం, రూ.2 కోట్లతో బతుకమ్మ ఘాట్, కమ్యూనిటీ హాల్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, అదేవిధంగా రూ.15 లక్షలతో పద్మశాలి, శాలివాహన, బుడిగజంగాల, ముదిరాజ్ కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపనలు చేశారు.
రూ.7.50 కోట్లతో శాలిగౌరారం ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేశారు. రూ.5.16 కోట్లతో నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, రూ.19.40 కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, 44,372 మందికి ఆసరా పింఛన్లు అందించారు. రూ.18 కోట్లతో ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ పూర్తిచేశారు. తిరుమలగిరి మండలంల మాలిపురంలో రూ.3కోట్లతో పాల్టెక్నికల్ కళాశాల, సుమారు రూ.6 కోట్లలో నూతన వసతి గృహం నిర్మించారు. అర్వపల్లిలో రూ.5 కోట్లతో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మానం, రూ.1.55 కోట్లతో సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు, రూ.3 కోట్లతో తుంగతుర్తిలో మార్కెట్ యార్డు నిర్మాణం, రూ.232 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం. రూ.4,80 కోట్లతో మోత్కూర్ మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటు, 30 పడకల ఆస్పత్రి మంజూరు చేశారు.
నూతనకల్‌లో రూ.110 కోట్లతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ నిర్మాణం, రూ.310.33 కోట్లతో నియోజకవర్గంలో మిషన్ భగీరథ పనులు జరిగాయి. రూ.2.30 కోట్లతో గ్రామాల్లో తాగునీటి సరఫరా పైపులైన్లు వేశారు. రూ.18 కోట్లతో గురజాల-మానాయికుంట బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం చేపట్టారు. తుంగతుర్తిలో రూ.44 కోట్లతో 100 పడకల దవాఖాన, రూ.43 కోట్లతో మద్దిరాల మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేశారు. గురుకుల, మోడల్, కస్తూర్బాగాంధీ పాఠశాలలు, పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు చేశారు. దళితబంధు పథకం కింద తిరుమలగిరి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రకటించి 2,223 కుటుంబాలకు రూ.250 కోట్లు అందించారు.
ఉమ్మడి తుంగతుర్తి నియోజకవర్గంలో 6 మండలాలు ఉండేవి. తుంగతుర్తి నియోజకవర్గానికి రావాలంటే శాలిగౌరారం ప్రజలు 75 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. అలాగే నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం ప్రజలు 25 కిలోమీటర్లు, మోత్కూర్ ప్రజలు 52 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. మండలాల పునర్విభజన తర్వాత సూర్యాపేట జిల్లాలో నాగారం, మద్దిరాల, యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడూరు మండలాలు ఏర్పడ్డాయి.
దాంతో తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాలు ఏర్పడి 3 జిల్లాల్లో విభజించడం జరిగింది. తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీలుగా ఏర్పడి రూ.100 కోట్లతో అభివృద్ధి జరిగాయి. అలాగే తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల మండలాలు సూర్యాపేట జిల్లాలో చేరాయి. మోత్కూర్, అడ్డగూడూరు, యాదాద్రి భువనగిరిలో చేరగా శాలిగౌరారం నల్లగొండ జిల్లాలో ఉంది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు తర్వాత శాలిగౌరారం నల్లగొండ రెవెన్యూ డివిజన్‌లోకి, అడ్డగూడూరు, మోత్కూర్ యాదాద్రి భువనగిరి, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల మండలాలు సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వెళ్లడంతో ప్రజలకు దూరభారం తగ్గింది.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పొలాల్లో కనిపించాల్సిన తడి, అన్నదాత కండ్లల్లో ఏరులై పారింది. కర్షకులు కరువు కోరల్లో చిక్కుకున్నారు. బంగారం పండాల్సిన భూములు నెర్రెలు బారి బీళ్లుగా మారాయి. సాగునీరు లేక విద్యుత్ అందక తెచ్చిన అప్పులు తీరక సగటున రోజుకు ఇద్దరు రైతులు చనిపోయిన పరిస్థితి. అయినా నాటి ప్రభుత్వాలు స్పందించలేదు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఈ దుస్థితి ఉండకూడదని ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటితోపాటు విద్యుత్ సమస్యను రూపుమాపారు. తాగునీటి కష్టాలు కూడా తీరాయి. ప్రస్తుతం చెరువులు, కుంటలు నిండుకుండల్లా జలకళ సంతరించుకున్నాయి. నాటి బీడు భూముల్లో నేడు సిరుల పంటలు పండుతున్నాయి.
2014కు ముందు నియోజకవర్గంలో సాగునీరు లేక వ్యవసాయ భూములు పడావు పడ్డాయి. అమ్ముదామంటే కొనేవారు లేక రైతులు అవస్థలు పడ్డారు. అలాంటి భూములకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు రావడంతో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. నాడు ఎకరానికి 25 వేల నుంచి 50 వేలు పలికిన ధరలు నేడు 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెరిగాయి. నాడు భూములు అమ్ముదామంటే కొనేవారు లేకపోగా, నేడు కొందామంటే అమ్మేవారు లేని పరిస్థితి నెలకొంది.
గత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాల తరబడి కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. కాళేశ్వరం పుణ్యమా అని పల్లెల్లో పచ్చని పైర్లు పండుతున్నాయి. ప్రజల ఆనందం చూస్తుంటే ఎంతో సంతృప్తి అనిపిస్తున్నది. మరోసారి తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
-గాదరి కిశోర్‌కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే
నియోజకవర్గం ఏర్పడిన ఆరు దశాబ్దాల్లో జరుగని అభివృద్ధి స్వరాష్ట్రంలో కేవలం తొమ్మిదిన్నరేండ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారు. 6వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నియోజకవర్గానికి అందాయి. అభివృద్ధి పనులకు రూ.1,955.71 కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.3,446.96 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. నియోజకవర్గంలో మొత్తం 1,41,265 ఎకరాల భూమి ఉండగా 2014కు ముందు 17 వేల ఎకరాలకు మించి సాగైన దాఖలాలు లేవు. నేడు 1,12,210 ఎకరాల్లో వరి సాగవుతుంది. ఒకప్పుడు తిండిగింజలు లేని, పని దొరకని ప్రాంతంలో నేడు సిరుల పంటలు పండుతున్నాయి.
నాడు నియోజక వర్గ వ్యాప్తంగా లక్ష మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం పండేది కాదు. మిషన్ కాకతీయ, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు సాగునీరు అందుతుండడంతో నేడు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. ఏపీ, బీహార్ నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండలోనే అత్యధికంగా వరి పండిస్తున్న ప్రాంతంగా తుంగతుర్తి నియోజక వర్గం ఖ్యాతి పొందింది. అలాగే మిషన్ భగీరథతో 132 గ్రామాలకు తాగునీరు అందుతున్నది.
కేసీఆర్ సారు వచ్చినంకనే మా బతుకులు బాగుపడ్డయి. ఏండ్ల సంది అరిగోస పడ్డాం. ఇప్పుడు ఆ బాధలు తీరినయి. 25 ఏండ్ల కింద నీళ్లు లేక మావాళ్లు వ్యవసాయ భూమి అమ్మితే 5 వేలకు ఎకరం చొప్పున ఏడెకరాలు కొన్నాను. ఆరోజు ఏడెకరాలకు పెట్టిన డబ్బుతో ఈరోజు ఎకరం కూడా కొనలేని పరిస్థితి. ఇదంతా సీఎం కేసీఆర్ సారు పుణ్యమే. చెరువులు, కుంటలు నిండి ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఏ బోరు పెట్టినా నీళ్లు తన్నుకొస్తున్నయి. ఇప్పుడు ఎకరం భూమి 30 నుంచి 50 లక్షలు పలుకుతుంది. వ్యవసాయం జోరుగా సాగుతుంది. పంటలు బాగా పండుతున్నయి. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– భానునాయక్, రామునిబండతండా, తిరుమలగిరి