బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 159.8, నల్లగొండ జిల్లా నకిరేకల్, శాలిగౌరారంలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం, వరదతో వాగులు పొంగి
పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. మూసీనదితోపాటు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కల్వర్టుల మీదుగా వరద పోటెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు ముందే అప్రమత్తం కావడంతో విపత్కర పరిస్థితులు చోటు చేసుకోలేదు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య రాకుండా చూస్తున్నారు. చెరువులు, కాల్వల గండ్లు, విద్యుత్‌స్తంభాల పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భాగస్వామయ్యారు. రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ మద్దిరాల మండలం నాగులకుంట వద్ద వరద ఉధృతితో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూశారు.
– సూర్యాపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ), నల్లగొండ
సూర్యాపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ) : కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. అనేక చోట్ల రహదారుల పైనుంచి నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లోని ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి ముందస్తు సమీక్షలు.. సూచనలు, ఆదేశాలతో జిల్లాలో ఎలాంటి నష్టమూ జరుగలేదు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తోపాటు ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు ముంపు ప్రాంతాలు, జలమయమైన రహదారులను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు అత్యవసర సమయాల్లో రెవెన్యూ శాఖ మాత్రమే టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించగా.. ఈ సారి మెడికల్, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బీ తదితర శాఖలు సెల్‌ఫోన్ నెంబర్లు ప్రకటించాయి.
కొద్ది రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని నకిరేకల్, కట్టంగూర్, నార్కట్‌పల్లి, తిప్పర్తి, శాలిగౌరారం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, ఫణిగిరి, నాగారం, నూతనకల్, తుంగతుర్తి, మద్దిరాల, ఆత్మకూర్.ఎస్, మోతె, చివ్వెంలతోపాటు మరికొన్ని మండలాల్లో 7నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా తిరుమలగిరి మండలంలో 159.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మేళ్లచెర్వు మండలంలో 2మి.మీ. వర్షపాతం రికార్డయ్యింది. దీంతో వందలాది చెరువులు నిండి అలుగులు పోస్తుండగా.. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వెరసి అనేక ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, మంత్రి జగదీశ్‌రెడ్డి వర్షాలు, వరదలపై ముందస్తుగానే అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేపట్టి ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు చపట్టారు.
జిల్లాలో వరద ముంపుతోపాటు ప్రవాహాల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆత్మకూర్.ఎస్ మండలం పాతర్లపహాడ్, నశింపేటలో వరద ప్రవాహాన్ని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ వేర్వేరుగా పరిశీలించారు. స్థానిక అధికారులను అప్రమత్తం చేసి నీటి ప్రవాహం తగ్గే వరకు రాకపోకలను నియంత్రించాలని ఆదేశించారు. జాజిరెడ్డిగూడెం కేజీబీవీలోకి నీరు చేరడంతో డీఈఓ అశోక్, మండల ప్రత్యేకాధికారి రామారావునాయక్ వెళ్లి పరిశీలించి పాఠశాలకు సెలవులు పొడిగించి విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. నాగారం మండల కేంద్రంలోని పెద్ద చెరువు అలుగు పోస్తుండగా తాసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, ఇరిగేషన్ అధికారులు.. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉధృతంగా ప్రవహిస్తున్న బిక్కేరు వాగును తాసీల్దార్ రమణారెడ్డి,.. మఠంపల్లి మండలం యాతవాకిళ్ల మేములూరి రిజర్వాయర్‌ను తాసీల్దార్ సాయాగౌడ్.. పాలకవీడు మండలం శూన్యంపహాడ్లో మూసీ నది బ్రిడ్జి వద్ద వాటర్ ఫ్లోటింగ్‌ను మండల స్పెషల్ అధికారులు, తాసీల్దార్లు, ఎంపీఓ, పీఆర్ ఏఈ, ఐబీ ఏఈలతోపాటు పోలీసులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లా పరిధిలోని శేషమ్మగూడెం, పాతపల్లె మధ్య ఉధృతంగా ప్రవహించిన వరద నీటిని మున్సిపల్ కమిషనర్ రమణాచారి పరిశీలించారు. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టు పైనుంచి భారీగా వరద ప్రవహిస్తుండగా తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించి రాకపోకలను నిలిపి వేయించారు.