మిర్యాలగూడ, జనవరి 24 : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు మంద పద్మతోపాటు వంద మంది మహిళలు బీఆర్ఎస్ నాయకుడు దైద సత్యం ఆధ్వర్యంలో తిప్పన విజయసింహారెడ్డి, నల్లమోతు సిద్ధార్థ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నేతలు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడుతూ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని పరిస్థితులు అగమ్య గోచరంగా మారాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అబద్ధాలతో కాంగ్రెస్ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జనం ఎక్కడికక్కడ తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు. ఫ్లయ్ ఓవర్‌కు శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా నేటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మున్సిపాలిటీకి మంజూరు చేయించిన రూ.76 కోట్ల పనులు సిద్ధంగా ఉన్నా బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందోననే భయంతో పనులు రద్దు చేయించారని ధ్వజమెత్తారు.
తిరిగి అంత పెద్ద మొత్తంలో నిధులు తెచ్చే దమ్ము నేటి పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పనితనం ఏంటో తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, మగ్ధుం పాషా, పశ్య శ్రీనివాస్‌రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, షోయబ్, దైద వెంకటేష్, కోల రామస్వామి, నేరెళ్ల శివ, పెండెం పద్మావతి, షెహనాజ్ బేగం, కోదాటి రమ, సరస్వతి, జయమ్మ, మొండి కత్తి లింగయ్య, సత్యనారాయణ, బాలు నాయక్, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.