తుంగతుర్తి, డిసెంబర్ 8 : ప్రజలకు అందుబాటులో ఉండడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.కోటి వెచ్చించింది. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఎన్నికలకు ముందు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యే మారడంతో ప్రసుత్త ఎమ్మెల్యే మందుల సామేలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని వినియోగించుకోవడం లేదు. భవనం ఖాళీగా ఉండడంతో చెత్తాచెదారం చేరుకుంటున్నది. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా కృషి చేయాలని, ప్రజాధనం వృథా చేయొద్దని పలువురు కోరుతున్నారు.
క్యాంపు కార్యాలయాన్ని వినియోగంలోకి తేవాలి
నియోజకవర్గ కేంద్రంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన క్యాంపు కార్యాలయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉండడం లేదు. ఏ ప్రభుత్వం కట్టినా స్థానిన ఎమ్మెల్యే అందులో ఉండాలి. ఇందులో ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గ ప్రజలు, అధికారులకు అందుబాటులో ఉండొచ్చు. వెంటనే కార్యాలయాన్ని వినియోగంలోకి తేవాలి.
– గునిగంటి సంతోష్ గౌడ్, తుంగతుర్తి
ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి
నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రసుత్త ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి. ప్రజలు తమ సమస్యలు నేరుగా ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకునే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే సైతం అధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని పరిష్కరించేందుకు దోహదపడుతుంది.
-బొజ్జ సాయికిరణ్, తుంగతుర్తి