మిర్యాలగూడ, జూన్ 5: మిర్యాలగూడ పట్టణంలోని ఒక నివాసంలో విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో ఇల్లు దగ్ధమై ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని కలాల్ వాడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో అమ్మమ్మతో పాటు మనుమడు, మనమరాలు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణంలోని కలాల్ వాడలో రేకుల ఇంట్లో నివాసం ఉంటున్న వనం చంద్రకళ(45), తన కూతురు ధనమ్మ పిల్లలు లక్ష్మణ్(16), ప్రణతి(14)తో నివాసం ఉంటున్నారు. చంద్రకళ పట్టణంలోని పలు ఇండ్లల్లో పని చేస్తూ జీవిస్తోంది. చంద్రకళ కూతురు ధనమ్మ భర్త పదేళ్ల క్రితమే మృతి చెందారు. కుమారుడు, కూతురును తన తల్లి వద్ద ఉంచి ధనమ్మ హైదరాబాద్‌లో పని చేసుకుంటోంది. నెల రోజుల క్రితమే చంద్రకళ భర్త సైదులు మృతి చెందాడు. తండ్రి మృతి చెందిన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న కూతురు ధనమ్మ మిర్యాలగూడకు వచ్చి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం కొద్ది రోజుల పాటు ఇకడ ఉండి పూణే నగరంలో పని కోసం వెళ్లింది.
శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో షార్ట్ సర్యూట్‌తో మంటలు చెలరేగాయి. అదే గదిలోని గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. మంటల ఉధృతికి చంద్రకళ, ఆమె మనుమడు, మనమరాలుకు మంటలు అంటుకుని బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోవడంతో గదిలోనే సజీవ దహనమయ్యారు. గమనించిన బంధువులు పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు, వన్ టౌన్ సీఐ నాగభూషణరావు సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగభూషణరావు తెలిపారు.