యాదాద్రి భువనగిరి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): చేనేత కళాకారుల ప్రతిభను అందిరికీ తెలియజేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం, మార్కెటింగ్ కల్పించాలనే లక్ష్యంతో ‘థ్రెడ్ పోచంపల్లి’ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టనుంది. శుక్రవారం హైదరాబాద్‌లో చేనేత కళా వైభవం ఆవిష్కృతం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంప్రదాయ వస్ర్తాలు, హస్తకళలు, స్థానిక వంటకాల పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు.
శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రదర్శన ఉంటుంది. గ్రామీణ చేనేత కార్మికులు, పట్టణ వినియోగదారుల మధ్య వారధిగా ఈ ప్రదర్శన ఉంటుంది. ఇందులో 100కుపైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. చేనేత కళాకారుల ఆధ్వర్యంలో 75 స్టాల్స్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 25 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. పోచంపల్లి నుంచి 53 స్టాల్స్, నారాయణపురం నుంచి 6, రామన్నపేట నుంచి 10, చౌటుప్పల్ మండలం నుంచి 12 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ. 80 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
పోచంపల్లి చేనేత చీరలు, చేతితో నేసిన వస్ర్తాలు, దుస్తులు, హస్తకళా ఉత్పత్తులు నేరుగా కార్మికులు, తయారీ దారుల నుంచే అందుబాటులో ఉండనున్నాయి. పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలు, పట్టు, కాటన్ చీరలు, పుట్టపాక తేలియా రుమాలు, దుప్పట్లు, ప్యాంట్, షర్ట్ క్లాత్, శాలువాలు తదితర వస్ర్తాలు ప్రదర్శించనున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు చింతకింద మల్లేశం, గజం గోవర్దన్, గజం అంజయ్యతోపాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ చేనేత కళాకారుల అవార్డు గ్రహీతలు పాల్గొననున్నారు. కేవలం వస్త్ర ప్రదర్శనకే పరిమితం కాకుండా సంప్రదాయ మగ్గాల ప్రత్యక్ష ప్రదర్శన, టై అండ్ డై నేత ప్రక్రియపై వివరణ, యాదాద్రి జిల్లా వంటకాల రుచులు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. యాదాద్రిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రదర్శన రూపొందించారు. ఆర్ట్, క్రాఫ్ట్, కల్చ ర్ థీమ్‌తో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు.