మిర్యాలగూడ, మార్చి 10 : తన కుమారుడు ప్రణయ్‌ను అతి దారుణంగా చంపిన నిందితులకు కోర్టు సరైన శిక్ష విధించిందని మృతుడి తండ్రి పెరుమాళ్ల బాలస్వామి అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 18న తన కుమారుడు ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీరావు సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు తెలిపారు. ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామని జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో పోరాటం చేసినట్లు చెప్పారు.
అయినప్పటికీ ప్రణయ్ హత్య తర్వాత కూడా చాలా పరువు హత్యలు జరిగాయని, వారందరికి కోర్టు ఇచ్చిన తీర్పుతో కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉండి శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, ఇలాంటి హత్యలకు పాల్పడడం విచారకరమని, కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు సమాధిపై పూలువేసి నివాళులర్పించి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.