తిరుమలగిరి అక్టోబర్ 26 : ఈ సంవత్సరం పత్తి రైతులకు కాలం కలిసి రాలేదు. పూత కాత దశలోనే వర్షాలతో పత్తి చేలు ఎర్రబారి, ఊడలు రాలడంతో దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశలో కొద్దిపాటి మేర పత్తి చేతికి అందినా సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటంతో దళారులకు విక్రయించి నష్ట పోతున్నారు. దళారులు గ్రామాల్లో మకాం వేసి తూకాల్లో మోసాలకు పాల్పడుతూ రైతులను దగా చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ అకాల వర్షాలు కురిస్తే పత్తి తడిసి, రంగుమారి నల్లబారుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుంగతుర్తి నియోజక వర్గంలో 72,880 ఎకరాల్లో అత్యధికంగా పత్తి సాగు చేసారు. హుజూర్నగర్ నియోజక వర్గంలో 29.384 ఎకరాలు, కోదాడ నియోజక వర్గంలో 14,379 ఎకరాలు, సూర్యాపేట నియోజకవర్గంలో 8,519 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుమలగిరి మండలంలో 7,510 ఎకరాలు, నాగారంలో 6,500 ఎకరాలు, జాజిరెడ్డిగూడంలో 2,123 ఎకరాలు, తుంగతుర్తిలో 3,742 ఎకరాలు, నూతనకల్ మండలంలో 5,483 ఎకరాలు, మద్దిరాలలో 5,971ఎకరాలు, అడ్డగూడూరులో 11,926 ఎకరాలు, మోత్కూర్‌లో 6,395 ఎకరాలు, శాలిగౌరారంలో 23,230 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు 8.110 ఉండగా వ్యాపారులు మాత్రం రైతులను దగా చేస్తూ 5 నుంచి 6 వేలకు క్వింటా కొనుగోలు చేస్తున్నారు.
ప్రారంభంలో కూలీల ఖర్చు రూ.350 ఉంటే ప్రస్తుతం ఒక్కో కూలీకి రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని చోట్ల కేజీ చొప్పున పత్తి తీయిస్తున్నారు. కేజీ పత్తికి రూ. 15 నుంచి 18 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో వ్యక్తి కనీసం 50 కేజీల వరకు పత్తి తీస్తారు. అంటే ఒక్కో కూలీకి రోజుకు రూ.750లు చెల్లించాలి. సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరిగే జాప్యాన్ని కప్పిపెట్టేందుకే స్లాట్ బుకింగ్ డ్రామాలని రైతులు విమర్శిస్తున్నారు. సెల్ ఫోన్లులేని రైతులు, వ్యవసాయ అధికారుల వద్ద స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పటం, అదే విధంగా పత్తి విక్రయించకుంటే 24 గంట ముందు స్లాట్ క్లోజ్ చేసుకోవాలని చెప్పటం రైతులను ఇబ్బందులకు గురిచేయటమేనని రైతులు విమర్శిస్తున్నారు. అదే వ్యాపారులకైతే ఎటువంటి నిబంధనలు ఉండవు. రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసిన వ్యాపారులు దొడ్డి మార్గంలో సీసీఐకి విక్రయిస్తున్న సందర్భాలు అనేకం.
సీసీఐలో విక్రయించాలంటే ఎన్నో నిబంధనలు..
పత్తి రైతులు మద్దతు ధర పొందాలంటే తేమ 8 శాతం కంటే మించరాదు. ప్రతి 1 శాతానికి రూ. 81.10 ధర తగ్గుతుంది. తేమ శాతం 12 కంటే మించితే సీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చెయ్యదనే నిబంధన రైతులను ఇబ్బందులు పెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 8 శాతం మించకుండా పత్తి విక్రయించటం అసాధ్యమే అంటున్నారు. 8 శాతానికి రూ. 8110, 9% రూ. 8028 , 10%రూ. 7947.80, 11% రూ. 7866.70 , 12% రూ. 7785,60గా నిర్ణయించారు. ఆపై తేమ ఉంటే సీసీఐలో కొనుగోలు చేయదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12 శాతం తేమ ఉన్నా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించిందని రైతు చెబుతున్నారు.
రైతులను ఆదుకోవాలి
ప్రభుత్వం వెంటనే సీసీ ఐ కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. ఈ సారి పత్తి దిగుబడి త గ్గింది. పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. వర్షాలతో నష్టపోతున్నాం. తేమ శాతం నిబంధనలు సడలించి, పత్తి కొనుగోలు చేయాలి.
-రాజు, పత్తి రైతు, నెల్లిబండ తండా