సూర్యాపేట, మే 9 (నమస్తే తెలంగాణ) : ‘దేశ సరిహద్దుల్లో రక్షణ సరిగా ఉంటేనే ప్రజలంతా శాంతియుతంగా జీవించగలరు. కానీ చీటికి మాటికి పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం భారతదేశ ప్రాణాలను తీస్తున్నది. ఏప్రిల్ 6న పహల్గామ్లో ఉగ్రవాదుల అనైతిక చర్యతో అన్డిక్లేర్ వార్‌ను పాకిస్తాన్ ప్రారంభించింది. ఇది రెండు రోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. సింధూర్-1తో పాకిస్తాన్ ఆత్మస్తైర్యం దెబ్బతీశాం. సింధూర్-2తో మన సత్తా ఏంటో తెలిపినం. ఈ సారి మంచి సందర్భం వచ్చింది. ఇక ఆగకుండా పాకిస్థాన్‌లో ఉగ్రవాదం జీరోకు వచ్చే వరకు యుద్ధం ఆగొద్దు’ మహావీర్ చక్ర అవార్డు గ్రహీత, దివంగత బిక్కుమళ్ల సంతోష్‌బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ ఆకాంక్షించారు. పాకిస్థాన్‌తో ప్రారంభమైన ఉద్రిక్తతలను నమస్తే తెలంగాణ ప్రస్తావించగా పలు విషయాలు తెలిపారు. 2020 జూన్ 15న చైనా బార్డర్ గాల్వాన్‌లోయ వద్ద చైనా దళాలతో వీరోచితంగా పోరాడి సంతోష్‌బాబు వీరమరణం పొందాడు. చైనా అన్ని రంగాల్లో విఫలం అవుతూ నేడు ప్రపంచంలోని పలుచనై తమకు తొత్తులుగా ఉండే దేశాల వెనుక ఉండి ఇతర దేశాలపై దాడులను ప్రేరేపిస్తున్నది.
అలాగే పాకిస్తాన్ నేడు భారత్‌పై దాడులకు పాల్పడే కుట్రలకు దిగుతుండడం వెనుక కూడా చైనా ఉంది. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల రక్షణ కోసం వ్యూహాలను అనుసరిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి, ఆర్మీకి దేశ ప్రజలుగా నైతిక మద్దతు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లో వందకు పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగినట్లు తెలుస్తుంది. ఉగ్రవాదుల్ని లేకుండా చేయాలి. సింధూర్-2ను కంటిన్యూ చేయాలి. నా కుమారుడు దేశం కోసం ప్రాణత్యాగం చేయడంతో వ్యక్తిగతంగా మాకు నష్టం జరిగినా దేశ సేవలో ప్రాణాలు కోల్పోవడం మాకు గర్వకారణం. అదే పద్ధతిన ఆర్మీలో పనిచేసే వారి కుటుంభాలు ధైర్యంగా ఉండాలి.వారికి ప్రజలు అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలి. ఈ సారి పాకిస్తాన్లో ఉగ్రవాదం అంటేనే వణికే పరిస్థితి వచ్చేలా భారత ప్రభుత్వం గట్టి దెబ్బతీయాలి.
నేను 2000 జనవరి 12న ఇండియన్ ఆర్మీలో చేరాను. మద్రాస్ రెజిమెంట్‌లో 16 మద్రాస్ బెటాలియన్‌లో పనిచేశా. ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ మెగాదూత్లలో పాల్గొన్న. 2005-06లో ఇండియా-పాకిస్తాన్ బార్డర్లో పనిచేశాను. 18 సంవత్సరాలు ఆర్మీలో సేవలందించాను. 2003-05 వరకు పంజాబ్ రాష్ట్రంలో లసీయాన్ ప్రాంతంలో డేంజర్ జోన్ రావి రివర్ ద్వారా ఇండియాలోకి పాకిస్థానీయులు రాకుండా రెండు సంవత్సరాలు విధులు నిర్వర్తించా. 2018 జనవరి 31న ఆర్మీలో రిటైర్ అయ్యాను. 18సంవత్సరాల సర్వీసులో 10 సంవత్సరాలు జమ్మూకశ్మీర్లోనే విధులు నిర్వర్తించా. ఆర్ఓపీ, పెట్రోలింగ్, ఆంబూస్లో డ్యూటీ చేసినం. మేం పూర్తిగా రహదారులు, పరిసర ప్రాంతాలు తనిఖీ చేసిన తరువాతే ప్రజలను పంపించేవాళ్లం. 26 కేజీల బరువుతో 24 గంటలు డ్యూటీలో ఉండేవాళ్లం. అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై వర్షాకాలంలో రబ్బర్ ట్యూబ్‌ల వంతెన ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కోసం ఎంతోమందిని వంతెన దాటించేవాళ్లం. మైనస్ 38 డిగ్రీల మంచులో డ్యూటీ చేసేవాళ్లం. మళ్లీ నా అవసరం ఉందంటే తప్పకుండా ఆర్మీలో చేరతా.
పహల్గామ్ దుర్ఘటనకు కారణమైన పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌తో తగిన గుణపాఠం చెప్పింది. ఉగ్రవాదులను తుదముట్టించడంలో ఆపరేషన్ సింధూర్ విజయం సాధించింది. నేను 18 సంవత్సరాలు ఆర్మీలో హవల్దార్ ప్లాటూన్ కమాండర్‌గా పనిచేశాను. కార్గిల్‌వార్, పార్లమెంట్ దాడి ఆపరేషన్‌లో పాల్గొన్నా. ఇండియన్ ఆర్మీ పిలుపు వస్తే ఇప్పటికీ యుద్ధం కోసం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. భారతీయులంతా ఐక్యంగా ఉండి సైనికుల మద్దతు తెలుపాలి. నేను దేవరకొండ పట్టణంలో మే 9 నుంచి 3 రోజులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆపరేషన్ సింధూర్ విజయాలను తెలుపుతా.