కోదాడ, జూలై 24 : స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ సత్తా చూపించి మెజార్టీ స్థానాలు గెలిపించుకోవడమే కేటీఆర్కు తామిచ్చే పుట్టినరోజు కానుక అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు కోదాడలో ఘనంగా నిర్వహించాయి. కోదాడలోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో కలిసి బొల్లం మల్లయ్య యాదవ్ కేక్ కట్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వపై ప్రజలు విరక్తి చెందారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. పదేండ్ల పాలనలో అన్ని రంగాలను రికార్డు స్థాయిలో అభివృద్ధి చేసి, ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు.
అన్ని వర్గాలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో లబ్ధి పొంది కాంగ్రెస్లో చేరిన కొంతమంది స్వార్థపరుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, ఎందుకు పార్టీ మారామా అని తలలు బాదుకుంటున్నారన్నారు. జెండా మోసిన వారికి భవిష్యత్లో సముచిత ప్రాధాన్య లభిస్తుందని, ఈ అంశంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేని వారికి ఓట్లు అడిగే అర్హత లేదని, ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎస్.కె.నయీమ్, మాజీ కౌన్సిలర్లు చంద్రశేఖర్, లలిత, వెంకట్, నాయకులు భూపాల్ రెడ్డి, చింత కవిత, భాగ్యమ్మ, కర్ల సుందర్ బాబు, ఇమ్రాన్, ఉపేందర్, కాసాని మల్లయ్య గౌడ్, ఉపేందర్ గౌడ్, శ్రీనివాస్, చలిగంటి వెంకట్ గోపాల్, దొంగరి శ్రీనివాస్, రాజేశ్ పాల్గొన్నారు.
అమెరికాలోని ఆస్టిన్లో బీఆర్ఎస్ నేత, కోదాడ వాసి జలగం సుధీర్ నేతృత్వంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్లో కేటీఆర్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్, పొన్నాల శ్రీనివాస్, వివేక్ రెడ్డి, శివ గౌడ్, రమేశ్ గౌడ్, చరణ్, యాదగిరి, అరుణ్ పాల్గొన్నారు.
Kodada : కేటీఆర్కు మనమిచ్చే పుట్టినరోజు కానుక ఇదే : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్