మునుగోడు, జూన్ 10 : పట్టా పాసుబుక్ ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మునుగోడు మండల ఏఓ పద్మజ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో గల రైతు వేదికలో ఫార్మర్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పత్తి పంట సాగులో చేయాల్సిన పనులను వివరించారు. తొలకరిలో కనీసం 60 మి.మీ. వర్షం కురిసిన తర్వాత విత్తనాలు విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం బాగుంటుందన్నారు. నేల స్వభావం, నీటి వసతులను దృష్టిలో ఉంచుకుని సరైన రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు.
పత్తిలో తప్పనిసరిగా అంతర పంటలు వేయాలని సూచించారు. ఎరువులను భూమి లోపల మొక్కకు దగ్గరగా పడేటట్లు గొర్రుతో గానీ / చేతితోగానీ వేయాలన్నారు. కాంప్లెక్స్ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో పైపాటుగా వేయకూడదన్నారు. నత్రజని, పొటాష్ ఎరువులను మాత్రమే పైపాటుగా వేసుకోవాలన్నారు. పురుగు మందులను విచక్షణా రహితంగా వాడకూడదన్నారు. గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించడానికి, రెక్కల పురుగు నియంత్రణకు లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలన్నారు. పత్తి తర్వాత జనవరిలో పప్పుధాన్యపు పంటలైన పెసర, మినుము పంటలు వేసుకుని మంచి దిగుబడిని పొంది, భూసారాన్ని పెంచుకోవచ్చన్నారు.
– నాణ్యత, అనుమతి లేని విత్తనాలను వాడకూడదు
– ఇసుక నేలలు, మరీ తేలికపాటి చల్క భూముల్లో పత్తి సాగు చేయకూడదు
– విత్తనశుద్ధి చేయకుండా విత్తనాలను విత్తకూడదు
– జూలై 15 తర్వాత వీలైనంత వరకు పత్తిని విత్తకూడదు
– రసాయనిక కలయిక లేని రెండు లేదా మూడు పురుగు, తెగుళ్ల మందులను కలిపి పిచికారీ చేయకూడదు
– గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని ఇళ్లలో గానీ, జిన్నింగ్ ఫ్యాక్టరీ వద్దగానీ నిల్వ ఉంచకూడదు
– కీలక దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి
– పంట కాలాన్ని ఏడు నెలలకు మించి పొడిగించకూడదు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేశ్, రైతులు పాల్గొన్నారు.