కేతేపల్లి, ఏప్రిల్ 9 : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది. కేతేపల్లి మండలం బొప్పారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి ధాన్యం చోరీ జరిగింది. ఇక్కడ వారం రోజుల కిందట కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఊరి పక్కన గల చెరువు దగ్గరున్న ఖాళీ స్థలంలో రైతులు వడ్లు పోశారు.
ఆ స్థలం పూర్తిగా నిండిపోవడంతో కాసనగోడు గ్రామం కొనుగోలు కేంద్రం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొందరు రైతులు ధాన్యం పోసుకున్నారు. రెండు రోజుల నుంచి రాత్రిళ్లు గుర్తుతెలియని దండగులు ఇక్కడి నుంచి రైతుల ధాన్యం దోచుకుపోతున్నారు. సోమవారం రాత్రి ఎంగలి గోపి, పొడిచేటి సోములు అనే రైతుల ధాన్యం రాసుల్లో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి పొడిచేటి సోములు, పొడిచేటి శంకర్, చౌగోని శ్రీరాములు అనే రైతుల ధాన్యం సుమారు 20 క్వింటాళ్ల వరకు దుండగులు ఎత్తుకుపోయినట్లు బాధిత రైతులు వాపోయారు.
దీనిపై కొనుగోలు కేంద్రం నిర్వాహకులను నిలదీస్తే ఎవరి ధాన్యానికి వారే రక్షణగా ఉండాలని, తామేమీ చేయలేమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, రాత్రిళ్లు కాపలాదారులను నియమించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు మండిపడుతున్నారు. ధాన్యం చోరీకి గురవడంపై బుధవారం కేతేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.