తిప్పర్తి, ఆగస్టు 22 : అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడి.. దళారులకు పెద్దఎత్తున యూరియా తరలిస్తూ సాధారణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని టీఆర్ఎస్ నేత, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం వరి, పత్తి ఎదుగుతున్నందున ఈ సమయంలో ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకపోతే అవసరం లేనప్పుడు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. నల్లగొండ మంత్రులు కమీషన్లకు కక్కుర్తి పడి దళారులకు యూరియా ఇవ్వడం వల్లనే, సాధారణ రైతులు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. యూ రియా కొరత ఉన్నప్పటికీ అధికారులు తప్పుడు ప్రకటన చేయాల్సిన అవసరం ఏంటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఆగస్టు చివరి నాటికే 90శాతానికి పైగా యూరియా జిల్లాకు చేరిందని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదన్నారు.
జిల్లాకు లక్ష మెట్రిక్ టన్నులకుపైగా యూరియా అవసరం ఉంటే, 70వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం, అందులో ఇప్పటివరకు 45వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వడంతో ఈ కొరత ఏర్పడిందన్నారు. వానకాలం సీజన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మంత్రులు సమీక్ష చేసి అధికారులను అలర్ట్ చేసి ఉంటే ప్రస్తుతం యూరియా కొరత ఉండేది కాదన్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు పీఏసీఎస్ చైర్మన్లుగా ఉన్న ప్రాంతాల్లోకి యూరియా పంపిస్తున్న అధికారులు మిగిలిన పీఏసీఎస్‌లకు ఎందుకు పంపించడం లేదన్నారు. నల్లగొండ జిల్లాకు రావాల్సిన 25వేల మెట్రిక్ టన్నులను వెంటనే తీసుకొచ్చి, యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, సలీం, ఆలకుంట్ల రమేశ్, జాగటి బాలయ్య ఉన్నారు.