నీలగిరి, సెప్టెంబర్ 30 : గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల నిర్వహణ బాధ్యత జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారి వరకు ఉంటుందని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామాల్లో శానిటేషన్‌ను మండల ప్రత్యేక అధికారులు రెగ్యులర్‌గా పర్యవేక్షించాలన్నారు.
వచ్చే వారం శానిటేషన్‌తోపాటు మొక్కలపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ఆశ వర్కర్లు సక్రమంగా పని చేయాలని, జ్వరాలు వచ్చినప్పుడు ఇంటింటికీ వెళ్లి పరీక్షించి మందులు ఇవ్వాలన్నారు. సాధారణ ప్రసవాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి కుటుంబానికీ డిజిటల్ కార్డు ఇవ్వాలన్న ప్రభుత్వ కార్యాచరణకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.
గ్రీవెన్స్‌కు వచ్చిన 74 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.. అనంతరం కలెక్టర్‌ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్చాలు అందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ అమిత్ పాల్గొన్నారు.