నల్లగొండ, మార్చి 11 : నల్లగొండ జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బంది లేదని,ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. యాసంగి సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందడం లేదని వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. రైతులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ఉదయ సముద్రం ప్రాజెక్టుల కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాంటి నీటి కొరతలేదని ఆమె స్పష్టం చేశారు.
రబి పంటలకు సాగునీటి విడుదల నిర్వహణపై మంగళవారం రాష్ట్ర మంత్రులు, చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో మంత్రుల ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఇరిగేషన్, రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 1.5 టిఎంసిల నీటికి గాను 0.86 టీఎంసీల నీటిని ఉదయ సముద్రం ద్వారా వదలడం జరుగుతున్నదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఉన్న 67,000 ఎకరాలకు ఈ నీరు సాగుబడికి వార బంది ప్రకారం పంట కోత వచ్చేవరకు ఇస్తామని తెలిపారు. అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఉదయ సముద్రం డి-40 కింద ఉన్న 11 -ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ 11 ఎల్ కింద ఉన్న మామిడాల, సర్వారం, ఇందుగుల, గోరింకలపల్లి గ్రామాలన్నిటికీ వారబంది ద్వారా నీరు వస్తుందని, ఈ గ్రామాల తర్వాత కూడా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించేందుకుగాను రెవెన్యూ ,ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సంయుక్తంగా ఉదయ సముద్రం ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రాజెక్టు కింద నీటి కొరత గాని, తేమ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఫిబ్రవరి నుండి ఎండలు తీవ్రమైన దృష్ట్యా కొంతవరకు నీరు తగ్గిన మాట వాస్తవమని ఆమె తెలిపారు. ఉదయ సముద్రంకు సాగునీటిని విడుదల చేసిన తర్వాత 30% భూగర్భ జలాలు పెరిగాయని అందువల్ల ఉదయ సముద్రం చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.
ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులందరూ సాగునీటిని ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తున్నట్లు, ఏ ప్రాంతానికి ఎంత నీటిని ఇవ్వాలనే విషయంపై ప్రతి రోజు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాలలో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి సాగునీరు, తాగునీటి విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదులు సమర్పించవచ్చని, తక్షణమే సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నకిరేకల్, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల్లోని కెనాల్స్ ద్వారా సాగు చేసే భూములకు ఎలాంటి సాగునీటి కొరతలేదని, 10 రోజుల్లో ఇక్కడ కోతలు కూడా పూర్తికానున్నట్లు తెలిపారు. అయితే దేవరకొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వేరుశనగ పంటలు ఆలస్యంగా సాగు చేశారని, అక్కడ కూడా పంటలు ఎండిపోకుండా రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉదయ సముద్రం ఈఈ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ వెంట ఉన్నారు.