కోదాడ, అక్టోబర్ 15 : కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పటికీ నది జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ కాశీనాదం ఫంక్షన్ హాల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ట్రిబ్యునల్‌కు హాజరైన తొలి మంత్రి తానేనన్నారు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని తెలిపారు. సూర్యాపేట జిల్లాకు దేవాదుల నుండి నీటిని రప్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణ జలాల వివాదంపై ట్రిబ్యునల్‌తో పాటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి పరిశీలకుడు సారత్ రౌత్, ఎమ్మెల్యే పద్మావతి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, పీసీసీ డెలిగేట్లు లక్ష్మీనారాయణ రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, రెండు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.