నల్లగొండ, అక్టోబర్ 16: నా కారు అద్దె బిల్లు ఇవ్వక 22 నెలలు అవుతుంది..ఇది కలెక్టరేట్లోని ఒక శాఖకు చెందిన జిల్లా అధికారి మాట. ఆఫీసులో ఫ్యాన్ వైరింగ్ కాలిపోతే.. నా జీతంలోంచి పెట్టుకొని రిపేర్ చేసుకున్నా…ఇది డీఆర్డీఏలోని కిందిస్థాయి అధికారి వాయిస్…జీరాక్స్లకు డబ్బులు పెట్టలేక చస్తున్నా…ఇది ఓ డీపీవోలో సెక్షన్ ఉద్యోగి ఆవేదన….టాయిలెట్ల క్లీనింగ్‌కు కూడా డబ్బుల్లేక తాళా లు వేసుకోవాల్సిన పరిస్థితి అంటూ అటెండర్ పెదవి విరుపు.. నల్లగొండ ఇది జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రేవంత్ సర్కార్‌పై మండిపడుతున్న తీరు తెన్నులు. జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పడం కాదు..ఏ బిల్లులు ఇవ్వకుండా ఆ ఇచ్చిన జీతాల్లోంచి కోతలు పెట్టకుండా చూడండి.. సీఎం గారూ అంటూ ఆయా శాఖల్లోని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వీపర్ నుంచి హెచ్‌వోడీ వరకు ఎవరి బాధ వారిదే..
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 22నెలలు పూర్తి చేసుకొని 23 నెలల్లోకి పాలన నడుస్తుంది. అయితే ఈ 23 నెలల్లో ఏఏ పదకాలు ప్రవేశపెట్టారు…వాటిని ఎలా అమలు చేస్తున్నారు..అనే విషయం పక్కన పెడితే….ఆ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అమలు చేస్తున్న అధికారులకు నెలనెలా ఠంచన్‌గా జీతాలు ఇస్తున్నామని చెప్పుకునే రేవంత్ రెడ్డి మాత్రం వారి శాఖల్లో నిర్వహణ ఖర్చులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. దీంతో స్వీపర్‌కు టాయిలెట్ల బాధ, అటెండర్‌కు చాయి బాధ, సిబ్బందికి నిర్వహణ ఖర్చుల బాధ, ఆఫీసర్లకు చెప్పలేని బాధలు మాత్రం ఇచ్చాడట. ఇంకేముంది…చేసేది ప్రభుత్వ ఉద్యోగమాయే…ఉండాల్సింది సర్కార్ కిందనాయే…ఇక కక్కలేక మింగలేక..ఎవరికి చెప్పలేక..ప్రభుత్వాన్ని ఎదిరించలేక కుమలాల్సిన దుస్థితి నేటి ఉద్యోగుల పరిస్థితి.
ఉద్యోగులకు భారంగా నిర్వహణ ఖర్చులు
ఉద్యోగులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధులు..వారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల్లటంతో పాటు ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో సుమారు 35 శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేసే పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయా ల్సి ఉంది. వీరికి నెలనెలా వేతనాలు ఇవ్వటంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నేటి రేవంత్ ప్రభుత్వం నెలనెలా వేతనాలు ఇస్తున్నామని చెబుతూ..నిర్వహణ ఖర్చులు ఇవ్వకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుందని ఉద్యోగులు అంటున్నారు. గంట పని ఎక్కువ చేయమంటే చేస్తాం, కానీ జీతాల్లోంచి ఖర్చు చేయమంటే ఎలా అంటూ ఆవేదనకు గురైతున్నారు. కనీస నిర్వహణ ఖర్చులు ఇవ్వకుంటే కార్యాలయాలు ఎలా నడపాలని కలెక్టరేట్లోని ఒక శాఖ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాన్లు రిపేర్, కరెంట్ బిల్స్, జీరాక్స్, ఇతర స్టేషనరీ ఎలా వస్తాయని ఆవేదన వ్యక్తం చేయటమే తప్ప ఎదిరించలేని పరిస్థితి.