కొండమల్లేపల్లి, నవంబర్ 19 : పదవతరగతిలో వందకు వంద శాతం ఫలితాలు సాధించాలి.. ఉత్తీర్ణత సాధించడమే కాదు.. అందరూ 10 జీపీఏ సాధించేలా పరీక్షలకు సిద్ధం చేయాలి. సిలబస్ పూర్తి చేయడమే కాకుండా రివిజన్‌కు సంసిద్ధం చేసేందుకు అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం బాగానే ఉన్నా విద్యార్థులు ఖాళీ కడుపుతో తరగతులకు హాజరు కావాల్సి వస్తోంది. దీంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. 853 మంది విద్యార్థులతో కొండమల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. ఒక్క పదో తరగతిలోనే ఐదు సెక్షన్లలో 213 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొండమల్లేపల్లి పలు గ్రామాలకు కూడలి కావడమే కాకుండా బోధన విషయంలో మంచి పేరు ఉండటంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యబోధన ఉంటేంది. సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకునేందుకు వస్తున్నారు. అంత దూరం నుంచి రావాలంటే ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లే సరికి రాత్రి 8 గంటలు దాటుతోందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. అయితే విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం పది గంటల పాటు పాఠశాలలోనే ఉండి చదువుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దాతల సాయంతో విద్యార్థులకు స్నాక్స్ అందజేయాలని విద్యాశాఖ అధికారులను అదేశించింది. కానీ మండంలో ఏ పాఠశాలలోనూ విద్యార్థులకు అల్పాహారం అందడంలేదు.
పదో తరగతి విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు పాఠశాలల టైం ముగిసిన అనంతరం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీని కోసం మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయలుదేరి పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. నిత్యం వ్యవసాయ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు ఆ సమయానికి పిల్లలకు అన్నం వండి పెట్టాలంటే ఇబ్బందే. దీంతో కొందరు విద్యార్థులు అన్నం తినకుండానే ఖాళీ కడుపులతో పాఠశాలలకు వస్తున్నారు. సాయంత్రం వరకు స్కూల్లో ఉండే విద్యార్థులు ఇంటి నుంచి స్నాక్స్ తెచ్చుకునే పరిస్థితి లేదు. ప్రత్యేక తరగతుల్లో మైండ్ పెట్టి చదవాల్సి ఉంటుంది. కానీ ఒక పక్క చలి, మరో పక్క ఆకలితో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టే పరిస్థితి ఉండదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం విద్యార్థులకు స్నాక్స్ అందించే పరిస్థితిలో లేమంటూ చేతులెత్తసింది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, పూర్వ విద్యార్థులు మందుకు వచ్చి విద్యార్ధులకు స్నాక్స్ (అల్పాహారం) అందించాలని సూచించింది. అయినప్పటికీ ఫలితం లేదు. గతంలో కొందరు దాతలు ముందుకొచ్చి పదోతరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించేవారు. కానీ ఈ సారి మాత్రం దాతలు కరువయ్యారు. దీంతో విద్యార్థులు సాయంత్రం పూట మంచి నీళ్లు తాగి సరిపెట్టుకుంటున్నారు. వ్యక్తిగత ప్రచారం, హంగూ ఆర్భాటాల కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టే ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు స్నాక్స్ అందిస్తే పుణ్యంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హృదయాల్లో స్థానం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
రోజూ 20 కిలో మీటర్ల దూరం నుంచి స్కూల్‌కు వస్తా . కొండమల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలో పాఠాలు బాగానే చెబుతారు. ఉద యం 8 గంటలకు పాఠశాలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకూ పాఠశాలలోనే ఉండా ల్సివస్తోంది. సాయంత్రం బాగా ఆకలేస్తుంది.. మంచినీళ్లు తాగి సరి పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం, దాతలు స్పందించి ఉదయం, సాయంత్రం స్నాక్స్ (అల్పాహారం) అందిస్తే బాగా చదువుతాం.
సాయంత్రం వరకు తరగతులు ఉండటంతో ఆకలి వేస్తోంది. దీంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. డబ్బులున్నవారు కొందరు బయట ఏమైన కొనుక్కొని తింటున్నారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి స్నాక్స్ అందిస్తే బాగుండు.
పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నాం. విద్యార్థులు సాయంత్రం పొద్దు పోయేదాకా పాఠశాలల్లోనే ఉండటంతో ప్రత్యేక తరగతుల సమయంలో వారు ఆకలితో అలమటిస్తూ చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. గతంలో ప్రత్యేక తరగతుల సమయంలో దాతల సాయంతో అల్పాహారం అందించేవాళ్లం. ఈ సారి దాతలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు దాతలు ముందుకొస్తే బాగుండు.