తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోళ్లు కరువయ్యాయి. ఇక్కడి పలు గ్రామాల్లో దాదాపు 500కిపైగా ఎకరాల్లో రైతులు సన్నాలు సాగు చేశారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో పోసి నెల రోజులైనా కొనుగోళ్లు చేయడం లేదు. దాంతో సెంటర్ల వద్దే రైతులు నిరీక్షిస్తున్నారు. పక్క మండలానికి వెళ్లి అమ్ముకోవాలంటే రవాణా ఖర్చులు భారంగా మారుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోనూ సన్నాలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు గోస తీస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల సమన్వయ లోపమో, సన్న వడ్లు కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనో.. సన్న ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. సాధారణంగా వానకాలంలో రైతులు అధికంగా సన్నాలు సాగు చేస్తుంటారు. ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటా కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పడంతో ఈ యాసంగి సీజన్లోనూ కొందరు అవే రకాలు సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఈ సీజన్లో 6.58 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం చేతికి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో కనీసం 50 శాతం.. 3.25 లక్షల మెట్రిక్ టన్నుల పంటనైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తారని లెక్కలు గట్టింది. కానీ, ఇప్పటివరకు 48వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పరిస్థితి దయనీయంగా మారింది. కాళేశ్వరం జలాలు రాకపోవడంతో ఈ యాసంగిలో ధాన్యం దిగుబడి తగ్గింఇ. దాదాపు అన్నిచోట్లా వేల ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నానాపాట్లు కాపాడుకున్న కొద్దిపాటి పంటనైనా అమ్ముకుందామంటే కొనే దిక్కు లేకుండా పోయింది.
తుంగతుర్తి మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో సరైన రీతిన, సమయానుకూలంగా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మెజారిటీ రైతులు ప్రైవేట్లోనే ధాన్యం అమ్ముకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రంతోపాటు ఒక మండలం కాగా ఇక్కడ సన్నబియ్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. తుంగతుర్తి మండలంలో 200 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తుండగా, వాస్తవానికి 500 ఎకరాలకుపైనే సాగు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరాకు 25 కింటాళ్ల చొప్పున లెక్కన చూసినా 12,500 క్వింటాళ్ల సన్న ధాన్యం పండింది. కానీ, ఈ మండలంలో సన్నాల రైతులకు ధాన్యం విక్రయించుకునే అవకాశమే లేకుండా పోయింది. రైతులు అధికారుల వద్ద ప్రస్తావిస్తే పక్క మండలమైన మద్దిరాలకు వెళ్లి అమ్ముకోవాలని సూచిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు రోజుకు రూ.2,500 కిరాయి చెల్లించాల్సి వస్తున్నదని, కొనుగోళ్లకు ఎన్ని రోజులు పడితే అంత రవాణా భారం మీద పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుత ఉన్న ఐకేపీ సెంటర్లలోనో లేక ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసో సన్న వడ్లు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
14 ఎకరాల్లో సన్నాలు సాగు చేస్తే 60 పుట్లు వడ్లు పండినయ్. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామంటే మా మండలంలో సన్న వడ్ల కేంద్రం ఏర్పాటు చేయలేదు. ట్రాక్టర్లలో తరలించాలంటే ఐదారు ట్రాక్టర్లు కావాలి. లేదంటే లారీ పెట్టుకొని దూర ప్రాంతంలోని ఐకేపీ సెంటర్కు వెళ్లాలి. నాతో పాటు చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు అన్నీ ఇబ్బందులే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సన్న వడ్లను తుంగుతర్తి మండలంలోనే ఎక్కడో ఒక చోట కొనుగోలు చేయాలి.
నాకున్న నాలుగెకరాల్లో సన్న వడ్లు సాగు చేశాను. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఊళ్లోని ఐకేపీ సెంటర్లో పోసి నెలరోజులైనా కొనే దిక్కు లేదు. ఎండ, వానకు అవస్థ పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి సన్న వడ్లు కొనాలి.