యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సారి పథకం సక్రమంగా అమలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీడ్ సరఫరా చేసే విషయంలో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. గతేడాది బిల్లులే ఇంకా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించడంలేదు. గతేడాది సైతం కోటిన్నర సీడ్ అని చెప్పి.. కేవలం 60 లక్షలు మాత్రమే చెరువుల్లో వదిలి చేతులు దులుపుకొన్నారు. దీంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు ఊతం ఇచ్చారు. మత్స్యకారులు ఎదిగేందుకు అన్ని రకాలుగా అండగా నిలిచారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వంద శాతం సబ్సిడీతో ఉచితంగా చేపల పిల్లలను అందజేసి మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. 2016లో ప్రారంభమైన ఈ కార్యక్రమంగా గతేడాది వరకు నిర్విరామంగా కొనసాగింది. ఎనిమిది విడతల్లో విడతలవారీగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశారు. జిల్లాలోని సుమారు 790 చెరువుల్లో ఏటా 3 కోట్ల సీడ్‌ను వదిలారు. ఇందుకోసం సర్కార్ ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. జిల్లాలో రెండు రకాల చేప పిల్లలను చెరువుల్లో వదిలేవారు. 35ఎంఎం నుంచి 40 ఎంఎం, 80 నుంచి 100 ఎంఎం వరకు ఉన్న సీడ్‌ను వదిలేవారు. దీంతో ఏటా చేపల ఉత్పత్తి పెరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల ఒట్టిపోయేవి. చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మత్య్సకారులకు ఉపాధి లభించకపోయేది. కొందరు వలసలు పోగా.. మరికొందరు ఇతర పనులు చేసుకునేవారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టింది. ఉచిత చేపల పిల్లల పంపిణీ పథకంతో ఎంతో మందికి ఉపాధి లభించింది. మత్స్యకారులు ఆర్థికంగా లాభాలు పొందారు. జిల్లాలో190 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా 8,929 మంది మత్య్సకారులు జీవనోపాధి పొందుతున్నారు. వీరే కాకుండా సభ్యత్వాలు లేని వారు, పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభిస్తున్నది. చేప పిల్లలు పెరిగాక వలలు వేసి.. అమ్మకాలు జరుపుతున్నారు. కానీ ఇప్పుడు సీడ్ పంపిణీపై నీలినీడలు కమ్ముకోవడంతో మత్స్యకారుల ఉపాధికి గండి పడే ప్రమాదం ఉంది.
కేసీఆర్ హయాంలో సక్రమంగా కొనసాగిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ సర్కార్ హయాంలో చతికిలపడింది. గతేడాది ఉచిత చేప పిల్లల పంపిణీ సగానికి తగ్గించింది. 1.5 కోట్ల సీడ్ వేస్తామని ప్రకటించినా కేవలం 60 లక్షలు మాత్రమే చెరువుల్లో వేసి చేతులు దులుపుకొంది. ఇక ఈ సారి జిల్లాలో 680 చెరువుల్లో 2.80 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో 1.40 కోట్లు చిన్నవి (35ఎంఎం నుంచి 40 ఎంఎం), 1.40 పెద్ద చేపలు (80ఎంఎం నుంచి 100 ఎంఎం) ఉండనున్నాయి. టెండర్ ప్రక్రియలో భాగంగా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద సైజుకు రూ. 1.60, చిన్న సైజుకు 60 పైసలుగా ఫైనల్ చేశారు.
గతేడాది చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లు పిలిచారు. దాని ప్రకారం కాంట్రాక్టర్లు సీడ్ అందించారు. సుమారు రూ. 3 కోట్ల విలువైన సీడ్‌ను అందించారు. ఇందుకు సంబంధించి బకాయిలు ప్రభుత్వం వద్దనే మూలుగుతున్నాయి. బిల్లులు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు నయా పైసా విదల్చలేదు. దీంతో కాంట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆలస్యంగానైనా మేల్కొన్న సర్కార్ సీడ్ సరఫరాకు టెండర్లకు ఆహ్వానం పలికింది. బిల్లులు చెల్లింపులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న కాంట్రాక్టర్లు టెండర్ వేసేందుకు ఆసక్తి చూపించడంలేదు. టెండర్ దాఖలు ప్రక్రియకు గడువు ముగిసినా ప్రభుత్వం పొడిగిస్తూ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 12వ తేదీ వరకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.