యాదగిరిగుట్ట, మే31: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎటుచూసినా భక్తులే కనిపించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారంతో పాటు వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తిరుమాడ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, శివాలయం, శ్రీవారి మెట్ల మార్గం సందడిగా మారింది. సుమారు 75 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు.
అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు.
అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతును చేపట్టారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణ తంతు జరిపారు. సాయంత్రం వేళలో శ్రీస్వామివారికి గరుడవాహనంపై, అమ్మవారికి తిరుచ్చి సేవపై వేంచేపు చేసి జోడు సేవను తిరువీధుల్లో ఊరేగించారు. స్వామివారి ఖజానాకు రూ. 81,77,104 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్ తెలిపారు.