Urea | కోదాడ, జూలై 6 : 50 కేజీల యూరియా బస్తా ఎమ్మార్పీ రేటు రూ. 266 కే విక్రయించాలని వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ససేమిరా సాధ్యం కాదని ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేస్తామని తీర్మానించారు. హోల్‌సేల్ డీలర్లు సిండికేట్‌గా మారి రూ. 266 లు ఉన్న యూరియా తమకు రూ. 380 లకు ఇస్తుండటం దీంతో పాటు రవాణా ఖర్చులు అదనంగా పడడంతో ఎమ్మార్పీ సాధ్యం కాదని అమ్మకాలు నిలిపివేయాలని తీర్మానించినట్టు డీలర్ల అసోసియేషన్ చెబుతుంది.
ప్రాథమిక సహకార కేంద్రాల్లో రూ. 266లకే రైతులు కొనుగోలు చేస్తున్నప్పటికి డీలర్లు మాత్రం ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని రైతులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి నెలకొన్నది. దీంతో నష్టాలు భరించలేక అమ్మకాలు నిలిపి వేసేందుకు నిర్ణయం తీసుకున్నామని డీలర్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల డీలర్ల సంఘాలు కూడా అమ్మకాలను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. యూరియా అమ్మకాలను డీలర్ సంఘం అసోసియేషన్ నిలిపివేస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న వ్యవసాయ అధికారులు ఆదివారం కోదాడ వర్తక సంఘంలో కోదాడ, మునగాల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీకే యూరియాను అమ్మాలని అలా చేయని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను బ్లాక్ చేసిన అధిక ధరకు అమ్మిన చర్యలు తప్పవని వ్యవసాయ అధికారులు డీలర్లను హెచ్చరించారు. కొంతమంది కావాలని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నరని విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అధికారుల ఒత్తిడికి తలొగ్గిన డీలర్లు సోమవారం నుండి యధావిధిగా ఎమ్మార్పీకే యూరియా అమ్మకాలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, స్థానిక వ్యవసాయ అధికారులు, ఎరువుల దుకాణాల యజమానులు పాల్గొన్నారు.