కోదాడ రూరల్, మార్చి31: యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై ధాన్య రాసులు పోసుకున్న రైతులకు ప్రభుత్వం నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పంటలను పట్టణాల్లోని దళారులకు విక్రయిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు పంటలు కోసి ధాన్యాన్ని రాసులుగా పోశారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఎప్పుడు వానలు కురుస్తాయోనని బిక్కు, బిక్కుమంటున్నారు. గతంలో పంట కోతలు ప్రారంభం కాగానే రైతులకు ధాన్యం ఆరబెట్టుకునేందుకు పట్టాలు అందించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేసేవారు.
ప్రస్తుతం ఇంత వరకు కొనుగోలు కేంద్రాల ఊసే లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రైవేటు వాహనాల్లో మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని మండలంలోని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పట్టణ పరిధిలోని తమ్మరలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సోమవారం సీపీఐ అధ్వర్యంలో రైతులు కల్లాల వద్దే నిరసన వ్యక్తం చేశారు.
మండల వ్యాప్తంగా పీఏసీఎస్, సమభావన సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. గ్రామాల్లో కోతలు ప్రారంభం కావడంతో ధాన్యం కల్లాలోనే రాసులుగా పోసి ఉన్నాయి. గిట్టుబాటు ధర కోసం రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలి.
-బొర్ర మధుసూదన్‌రావు, రైతు గణపవరం
రైతులపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ నేడు ఎవరికీ లేదు. నాడు రైతు ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతో వరి కోతలు ప్రారంభం కాగానే రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు పట్టాలు అందించి అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసి రైతుపై ప్రేమను చాటుకున్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదు. వారి పథకాలను తుంగలో తొక్కి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రస్తుత యాసంగిలో కోతలు ప్రారంభమైనా నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం సైతం అనుకూలంగా లేదు, రైతులకు పట్టాలు అందించి ఆదుకోవాలి.
-అన్నెం అంజిరెడ్డి, రైతు, రామలక్ష్మీపురం