భువనగిరి కలెక్టరేట్/నేరేడుచర్ల, ఏప్రిల్ 23 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
రామన్నపేట, గుండాల మండలాల్లో 42.5, బీబీనగర్ మండలం వెంకిర్యాల, రాజాపేటలో 42.4, చౌటుప్పల్, మోత్కూరు మండలం బిజ్లాపూర్లో 42.2, రాజాపేట మండలం పాముకుంట, వలిగొండ మండలం వెంకట్పల్లెలో 42.1, ఆలేరు మండలం కొలనుపాక, అడ్డగూడూర్, ఆత్మకూరులో 42, చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్, మోత్కూరు మండలం దాతప్పగూడెంలో 41.9, భువనగిరిలో, బొమ్మలరామారం, మోటకొండూర్లో 41.8, తుర్కపల్లిలో 40.9, యాదగిరిగుట్టలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా ఎండ తీవ్రతతోపాటు వడగాల్పులు, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పానీయాలను తాగుతున్నారు. కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది.