యాదాద్రి భువనగిరి, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : నవంబర్ నెల ప్రారంభంలోనే చలి ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. నవంబర్ మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం చర్చించుకుంటున్నారు. మరోవైపు చలితో రోగాలు విజృంభించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. రోగులతో దవాఖానలు కిటకటలాడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నా యి. సోమవారం రాత్రి రాజాపేట మండలంలోని పాముకుంటలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపేటలో 15.1, ఆలేరు మండలం కొలనుపాకలో 15.3, మోత్కూరు మండలం బిజిలాపూర్లో వలిగొండ, ఎం.తుర్కపల్లి, బీబీనగర్, భువనగిరి, బొమ్మలారామంలో 16.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5.30 గంటలకే సూర్యాస్తమయం అవుతున్నది. దీంతో ఆరు గంటలకే చీకటిపడటంతో చలి ప్రారంభమవుతున్నది. రాత్రి వేళ విపరీతంగా మంచు కురుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు సూర్యుడు కనిపించడంలేదు. చలిగాలులు వీస్తుండటంతో జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రారంభం..
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల గాలి, నీరు, క్రిమికీటకాల ద్వారా రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. చలితోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. కాలుష్యం, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల దోమలు, క్రిమికీటకాల కారణంగా రోగాలు వ్యాపిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు, ఆస్తమా, చర్మ సం బంధ వ్యాధులు, న్యూమోనియాలాంటి జబ్బులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ కాలంలో ఇన్ఫ్ల్యూయెంజా, ఫ్లూ వైరస్ దాడి చేసే ప్రమాదముంది. శరీరంలో తేమ శాతం తగ్గిపోవడంతో చర్మం రక్షణ శక్తి సన్నగిల్లుతుంది. కాగా చలిగాలులతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం, జలుబు, తలనొప్పి తదితర రోగాల ప్రబలుతున్నాయి.
జర భద్రం..
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలం అస్తమా ఉన్న వారు నిత్యం వాడే మందులను ఎప్పుడూ అందుబాటులో ఉం చుకోవాలి. దుమ్మూ, ధూళికి దూరంగా ఉండాలి. చల్ల గాలిలో ఎక్కువగా తిరగొద్దు. ప్రయాణం చేస్తున్నప్పుడు నోరు, ముక్కు కవర్ అయ్యేలా మాస్కులు, స్వెట్టర్లు ధరించాలి. బైకుపై వెళ్లేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హార్ట్ పేషెంట్లు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలిలో ఎక్కువగా తిరగడం వల్ల రక్తనాళాలు సంకోచించి గుం డె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జ్వరం, దగ్గు, జలుబు వస్తే ఇంట్లోనే ఉండాలి. బయట ఎక్కువగా తిరగొద్దు. ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. నూలు వస్ర్తాలు ధరించాలి. చిన్నపిల్లలకు చేతులు, కాళ్లకు గ్లౌజ్‌లు వేయాలి. కాళ్లు, చేతులు పగుళ్లు రాకుండా వ్యాజిలిన్ రాసుకోవాలి. ఉదయం 8గంటల కంటే ముందు, సాయంత్రం 6గంటల తర్వాత దూర ప్రయాణాలను రద్దు చేసుకుంటే మంచిది. బీపీ, షుగర్ ఉన్న వారు సైతం జాగ్రత్తలు పాటించాలి.
చిన్నారులపై జాగ్రత్త వహించాలి
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. చిన్న పిల్లలకు త్వరగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చల్ల గాలులకు తిప్పకూడదు. ఇంట్లో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగితే మంచిది. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. చిన్నారులకు స్వెట్టర్లు వేయకుండా ఆరు బయట తిరగనివ్వద్దు. వీలైనంత వరకు మాస్కులు వాడితే బెటర్.
– డాక్టర్ సురేష్, పిడియాట్రిక్