నల్లగొండ సిటీ ఏప్రిల్ 23 : ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరింది.కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొదటి డ్యూటీ నుంచి కార్మికులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ రీజియన్ పరిధిలో నల్లగొండ ,మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ, నార్కట్‌పల్లి, కోదాడ, యాదగిరి గుట్ట డిపో పరిధిలోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమ్య స్థానాలు చేరుకొవడానికి గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూశారు. బస్సులు అందుబాటులో లేక పోవడంతో ప్రైవేట్ వాహనాలను అశ్రయించి అధిక చార్జీలు చెల్లించారు.
ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు అనేక హమీలు ఇచ్చిందని వాటి అమలు కోసం మాత్రమే తాము ధర్నాలు చేస్తున్నామని ప్రభుత్వం ఇచ్చిన హమీలు తప్ప తాము ఇతర డిమాండ్లు కోరడం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఉద్యోగులకు భద్రత కల్పిస్తామంటూ హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే కుట్రలో భాగంగా నూతన ప్రైవేట్ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతోందన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య ప్రైవేట్ బస్సులతో పాటు ఎలక్ట్రికల్ బస్సులు నడిపిస్తున్నారన్నారు.
సమ్మె మరింత ఉధృతం..
ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు మహాధర్నాకు దిగారు. అనంతరం బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభు త్వం వెంటనే జేఏసీ నేతలతో చర్చలు జరపాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏ సీ రాష్ట్ర నాయకులు నరేందర్,యార చంద్రయ్య, బాసాని వెం కటయ్య, కేఎస్‌రెడ్డి, జల్దా వెంకటేశ్వర్లు, టిజేరివు, ఎన్ఆర్సీ రా జు, మీలా ప్రభాకర్, కేఎల్ నాయక్ తదితరులు ఉన్నారు.

ఆర్టీసీని ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్ర.. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం
కోదాడ, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టలు కొడుతూ, వారి సమస్యలు పరిష్కరించుకుండా తాత్సారం చేస్తోందని, సంస్థను ప్రైవేటీకరించేందుకు కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. కోదాడ డిపో ఆవరణలో గురువారం ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని రెండున్నర సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సివచ్చిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మెపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కార్మికులు సమ్మె చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అవగాహన లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వల్ల ప్రయాణికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. గతంలో ప్రతి చిన్న సమస్యపై మాట్లాడిన కోదండరాం లాంటి వారు ఆర్టీసీ సమ్మెపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సమ్మెను నీరుగార్చేందుకు పోలీసు యంత్రాగాన్ని రంగంలోకి దింపడం, కార్మికులపై ఒత్తిడి తేవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, నాయకులు, కుక్కడపు బాబు, సుంకర అజయ్‌కుమార్, తొగరు రమేష్, ఉపేందర్‌గౌడ్, కరీముల్లా, గొర్రె రాజేష్, చలిగంటి వెంకట్, పిట్టల భాగ్యమ్మ, ఉపేందర్‌గౌడ్, జానీ, అబ్థుల్లా, పుల్లయ్య, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
పోలీసులకు, కార్మికుల మధ్య వాగ్వివాదం..
ఆర్టీసీ కార్మికులు గురువారం డిపో ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. తాము సమ్మెలో ఉండగా నిర్బంధంగా బస్సులను బయటకు ఎలా పంపిస్తారని పోలీసులతో వాదులాటకు దిగారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్
నార్కట్‌పల్లి ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. గురువారం నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు తలపెట్టిన సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలవుతున్నా అప్పటి నుంచి రైతులను, కార్మికులను పట్టించుకోకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. కార్మికుల సమ్మె న్యాయమైనదేనని, వారి సమస్యల పరిష్కారంలో ప్రభత్వం చిత్తశుద్ధి చూపాలన్నారు.
కార్మికులు జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరితే 41 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఏడాది నుంచి నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని అన్నారు. రాష్ట్రంలోని 38 వేల మంది కార్మికులు హామీలను నెరవేర్చాలని సమ్మెకు దిగితే పోలీసులతో ప్రైవేటు బస్సులు నడుపుతోందన్నారు. ప్రైవేటు బస్సులకు సంబంధించిన అగ్రిమెంట్లు రద్దు చేస్తామని భయాందోళనలకు గురి చేస్తూ బలవంతంగా నడిపించేలా ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, మేకల రాజిరెడ్డి, చింతపల్లి బయ్యన్న, ఐలయ్య, శ్రవణ్, యాదయ్య, భూషణం, జంగయ్య, కేఎన్ రెడ్డి, నరసింహ, సుజాత, లింగమ్మ, వెంకన్న, చంద్రం, గోపాల్, శ్రీదేవి, కేవీ రెడ్డి పాల్గొన్నారు.
కార్మికులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.. మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 23: ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరింది. ఉదయమే కార్మికులు బస్‌డిపో వద్ద బైఠాయించి ఒక్క బస్సును కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. ధర్నాకు మాజీ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మద్దతు పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేయాలన్నారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, జండి జంగమ్మ, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.