కారేపల్లి/ ఆళ్లపల్లి/ చింతకాని/ పాల్వంచ/ వేంసూరు, ఆగస్టు 2: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కారేపల్లి మండలంలో బైక్ అదుపు తప్పి విద్యుత్ ఉద్యోగి మృతిచెందాడు. అదే మండలం ఎర్రబోడు కోయగుంపునకు చెందిన వజ్జ సునీల్(35) ఖమ్మంలోని ఓ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుడు పాయం సాయితో కలిసి పనిమీద ఎర్రబోడు నుంచి కారేపల్లి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మోటర్‌సైకిల్ అదుపుతప్పి కిందపడ్డారు. సునీల్ తల రాయికి తగలడంతో అకడికకడే మృతిచెందాడు.
ఇదే కారేపల్లి మండలం మంగలితండాకు చెందిన తేజావత్ రాందాస్(51) బైక్‌ను ఓ లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. రాందాస్ మాదారం డోలోమైట్ మైన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాలో గల ఓ గ్రామంలో తమ బంధువుల్లో ఒకరు మృతిచెందగా బైక్‌పై వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొని శనివారం రాత్రి తిరిగి వస్తున్నాడు. ఖమ్మం- ఇల్లెందు ప్రధాన రహదారి శివాయిగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ.. రాందాస్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రాందాస్‌ను స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉండగా ఏడాది కిందట కుమారుడు మృతిచెందాడు. కొద్దికాలంలోనే తండ్రీకొడుకులు మృతిచెందడంతో మంగలితండాలో విషాదచాయలు అలముకున్నాయి.
చింతకాని మండలం జగన్నాథపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఏపీలోని గంపలగూడెం మండలం కొణిజర్లకు చెందిన జూపెల్లి శ్రీనివాసరావు(58) మృతిచెందాడు. శ్రీనివాసరావు అతడి స్నేహితుడు సిలివేరు రామకృష్ణ కలిసి బైక్‌పై ఖమ్మం వైపు వెళ్తుండగా వారి వాహనాన్ని ఎదురుగా వచ్చి ఆటో ఢీకొట్టింది. కిందపడి తీవ్రగాయాలపాలైన శ్రీనివాసరావు, రామకృష్ణను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతిచెందాడు. రామకృష్ణను మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. అలాగే, గ్రీన్‌ఫీల్డ్ హైవే వేంసూరు ఎగ్జిట్ సమీపంలోని చోడవరం వద్ద హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న గ్రానైట్ లారీని, వెనుక నుంచి వస్తున్న ఉల్లిపాయల లోడు లారీ అతివేగంతో ఢీకొట్టింది. ఆ తీవ్రతకు ఉల్లిపాయల లారీ ముందు భాగంలో మంటలు చెలరేగాయి.
క్యాబిన్లో డ్రైవర్ ఇరుకుపోవడంతో అదే మార్గంలో వెళ్తున్న ఇతర లారీల డ్రైవర్లు శ్రమించి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రేమ్‌కుమార్ స్వల్పంగా, క్లీనర్ సుఖేశ్ కాలిపోయి గాయపడ్డారు. 108 వాహన సిబ్బంది వచ్చి వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇక, భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం రాయిపాడులో పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మ రాంబాబు(30) శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమీపంలోని కిన్నెరసాని వాగు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆయనకు ఫిట్స్(మూర్చ) రావడంతో వాగులో పడిపోయి మృతిచెందాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆదివారం గ్రామస్తులు వాగు దగ్గరకు వెళ్లడంతో అక్కడే విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టులో పడి కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన తంగెళ్లపల్లి సంతోశ్‌కుమార్(24) అనే యువకుడు ఆదివారం మృతిచెందాడు. కొత్తగూడెంలోని గణేశ్‌టెంపుల్ ఏరియాలో బార్బర్ షాపు నిర్వహిస్తున్న సంతోశ్‌కుమార్, అతడి సొంత అన్నతోపాటు మరో ఇద్దరు కలిసి నలుగురు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో కిన్నెరసాని ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అక్కడ భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు వెళ్లిన సంతోశ్‌కుమార్ కాలుజారి అందులో గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి కాలువ వెంట పోయి పట్టుకొని బయటికి తీసేలోపు అప్పటికే మృతిచెందాడు.