రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో నిర్దేశించిన శిబిరాల వద్ద శుక్రవారం ప్రజలు బారులు దీరారు. 18ఏండ్ల పైబడిన వారు ఆధార్ కార్డుతో శిబిరాలకు వస్తే వైద్యారోగ్య శాఖ సిబ్బంది వివరాలు నమోదు చేసుకుని పరీక్షలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 6,645 మందికి, నల్లగొండ జిల్లాలో 10,244 మందికి పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్నవారికి ఐ డ్రాప్స్, మందులు అందించారు. అందులో 6,203 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. దృష్టి లోపం ఉన్న 4,488 మంది కోసం ప్రిస్కిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. ఆ కండ్లజోళ్లను 15 రోజుల్లో ఆశ కార్యకర్తలు ఇంటికే వచ్చి అందించనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమం సజావుగా సాగుతున్నది.
సమాజంలో ఏ ఒక్కరూ అంధత్వంతోపాటు కంటి సంబంధిత వ్యాధులతో బాధపడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. రెండో రోజు శుక్రవారం సూర్యాపేట జిల్లాలో 6,645 మందికి, నల్లగొండ జిల్లాలో 10,244 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం పర్వతగిరి, గుర్రంపోడు మండల కేంద్రాల్లో కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి, నిడమనూరు మండలం పార్వతీపురంలో ఎమ్మెల్యే నోముల బగత్కుమార్ కంటి వెలుగు కేంద్రాలను పరిశీలించారు. పరీక్షలు చేయించుకునేందుకు ఉదయం నుంచి జనం క్యూ కడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గురువారం 5,791 మందికి, రెండో రోజు 6,645 మందికి పరీక్షలు చేశారు. నల్లగొండ జిల్లాలో గురువారం 8,391 మందికి, శుక్రవారం 10,244 మందికి పరీక్షలు చేశారు. అవసరం ఉన్న వారికి రీడింగ్ కళ్లద్దాలు వెంటనే ఇస్తున్నారు. సైట్ ఉన్న వారి కోసం అద్దాలను ఆర్డర్ పెట్టారు. కంటి శుక్లాలు ఉంటే ఆపరేషన్ కోసం రెఫర్ చేశారు. శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 6,203 మందికి రీడింగ్ గ్లాసులు, 4,488 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసులు అందించారు.
– సూర్యాపేట, జనవరి 20 (నమస్తే తెలంగాణ)
నాకు 92 సంవత్సరాలు. ఇంటికాన్నే ఉంటా. కొన్నేండ్లుగా నా కండ్లు మంచిగా కానొస్తలేవు. నాపని కూడా సక్కగా చేసుకోలేక మంచంలోనే పడివున్నా. చావుదగ్గరకు వచ్చిన నాకు ఎందుకు పరీక్షలు అనుకున్నా. మా తండాలో సర్కారోళ్లు కంటి పరీక్షలు ఉత్తగనే చేస్తున్నరని తెలిసి కండ్ల పరీక్షకు పోయిన. డాక్టర్లు పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మంచిగానే కానొస్తున్నాయి. ఇప్పుడు నా పని నేను చేసుచేసుకుంటున్నా. ఇంటోళ్లుకు కూడా పనిచేసి పెడుతున్నా. కేసీఆర్ సారు మంచిపని చేసిండు. ఆయనకు రుణపడి ఉంటా.
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అడుగకుండానే అన్నీ సమకూర్చుతున్నాడు. మా పేదోళ్ల అవసరాలు ఆయనకు తెలుసు. ఆడ బిడ్డల పెండ్లిళ్లకు, ముసలోళ్లకు పింఛను, వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తున్నడు. ఇప్పుడు కళ్ల సమస్యలున్నోళ్లకు పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు అందిస్తున్నడు. కేసీఆర్ సార్ వచ్చినంకనే ప్రభుత్వ దవాఖానలు మంచిగైనయి. ఆయన కడుపు చల్లగుండ.
-అంబడి గోపమ్మ, అడ్లూరు(కోదాడ రూరల్)
గత సంవత్సరం నుంచి నాకు చూపు మందగించింది. ఒక సారి ప్రైవేట్ దవాఖానలో పరీక్షలు చేయించుకున్నా. అద్దాలు వాడాలని చెప్పిండ్రు. అద్దాలకే రెండు వేల రూపాయలు అవుతాయన్నారు. గురువారం కుడకుడలో పెట్టిన కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నా. అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు నా కండ్లు తేటగా కనిపిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం పేదలకు వరంలాంటిది.
-మార్తా విజయ కుడకుడ(చివ్వెంల)
కంటి వెలుగు కార్యక్రమం పెట్టకపోతే మాలోంటి పేదలు మిర్యాలగూడ, నల్లగొండకు పోయేటోళ్లం. ఇప్పుడు ఊళ్లోకే వచ్చి కంటి పరీక్షలు చేస్తున్నరు. మందులు ఇచ్చి అవసరమున్న వారికి అద్దాలు సైతం ఇస్తున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల నేను పరీక్షలు చేయించుకున్నా. ముసలోళ్లకు ఇబ్బంది తప్పింది.
– జిల్లి రాములమ్మ, అన్నారం, అనుముల మండలం(హాలియా)
దగ్గర చూపు కన్పించక పోవడంతో ప్రైవేట్ దవాఖానకు వెళ్దామని అనుకున్నా. ఇంతలోనే ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని మళ్లీ చేపడుతామని చెప్పడంతో ఊరుకున్నా. శుక్రవారం పెట్టిన ప్రత్యేక శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుంటే అద్దాలు ఇచ్చారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నా కండ్లు ఇప్పుడు మంచిగా కనపడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమం పెట్టి మా లాంటి పేదలకు సీఎం కేసీఆర్ మేలు చేస్తున్నడు.
-సోమ శ్రీదేవి (కొండమల్లేపల్లి)
నేను 20 సంవత్సరాలుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. ఈ మధ్యన లారీ నడిపేటప్పుడు దూరం చూపు మాత్రమే స్పష్టంగా కనబడేది. దాంతో కొద్దిరోజులు ఇంట్లోనే ఉన్నా. సీఎం కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్నా. డాక్టర్లు కళ్లద్దాలు ఇచ్చారు. అవి పెట్టుకున్నాక దగ్గరి చూపు బాగా కనబడుతున్నది. నేను మళ్లీ లారీ నడుపుతా. కేసీఆర్సార్కు ధన్యవాదాలు.
-వరికుప్పల సుదర్శన్, చందంపల్లి(నకిరేకల్)
ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కంటి పరీక్షలతోపాటు మందులు, చుక్కల మందులు, కళ్లద్దాలు ఇస్తుండటంపై ప్రభుత్వానికి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదోళ్ల బాధలను అర్థం చేసుకున్నారని అవ్వాతాతలు కొనియాడుతున్నారు. కంటివెలుగు శిబిరం నుంచి బయటకు వస్తూ కంటి చూపు తెచ్చిన గొప్ప నేత కేసీఆర్ అని పొగుడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కళ్లద్దాలు పెట్టుకొని సంతోషంగా గడుపుతున్నారు. మా బాధలు తెలిసిన పెద్ద కొడుకు అని దీవిస్తున్నారు.
కంటి వెలుగు పథకం పేదల కళ్లల్లో వెలుగులు నింపుతున్నది. కంటి సమస్యతో బాధపడుతున్న ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, కండ్లద్దాలు ఇస్తున్నారు. పేదలకు ఆర్థిక భారం తప్పింది.
-చింత ఆంధ్రయ్య, కేతేపల్లి
నాకు కొన్ని ఏండ్ల నుంచి కండ్లు సక్కగా కనిపించక ఇబ్బందులు పడేదాన్ని. దవాఖానకు పోయి చూపించుకుందాం అని అనుకుంటే మా ఇంటి పక్కోళ్లు సంక్రాంతి దాటినంకా మన ఊళ్లోనే సర్కారోళ్లు కంటి పరీక్షలు చేస్తారంటా అని చెప్పిండ్రు. సరే వస్తారు అనుకున్నా. శుక్రవారం పంచాయతీ ఆఫీసుకు కాడికి ఆధార్ కార్డు పట్టుకొని పోయిన. డాక్టర్లు దూరపు, చూపు దగ్గరి చూపు పరీక్షలు చేసిండ్రు. అద్దాలు ఇచ్చిండ్రు. వెంటనే అద్దాలు ఇస్తరని అనుకోలే. ఇప్పుడు మంచిగా కనబడుతున్నది. శానా సంతోషంగా ఉంది.
-చిక్కుళ్ల లక్ష్మమ్మ, ఎల్లారెడ్డి గూడెం(నార్కట్‌పల్లి)
మాది పేద కుటుంబం. కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్ డబ్బులతో జీవితం గడుపుతున్నాం. డబ్బులు పెట్టి ఆస్పత్రుల్లో చూపించుకునే స్తోమత లేదు. నాకు కంటి చూపు సరిగ్గా కనిపించడం లేదు. పరీక్షలు చేసి మందులు ఇచ్చిండ్రు. పెద్దగా ఇబ్బంది లేదని చెప్పిండ్రు. ఉచితంగా ఇలాంటి కార్యక్రమం పెట్టడం బాగున్నది.
-పంది రాములమ్మ(నాగారం)
మా ఊర్లో కంటి వెలుగు కార్యక్రమం పెట్టిండ్రు. కంటి పరీక్షలు చేయించుకున్నా. నజర్ తక్కువ ఉందని అద్దాలు ఇచ్చిండ్రు. అద్దాలు పెట్టుకుంటే చూపు మంచిగా కనిపిస్తున్నది. పైసలు తీసుకోకుండా ఇంత మంచి పని చేస్తున్నారు. మాలాంటి పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
-దొరగళ్ల పోచయ్య, ముక్తార్ (భూదాన్‌పోచంపల్లి)