మహిళా సంరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నది. అందులో భాగంగా తీసుకొచ్చిన మహిళా క్లినిక్‌లను క్రమంగా అంతటా విస్తరిస్తున్నది. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 6 చోట్ల ఈ ప్రత్యేక కేంద్రాలు విజయవంతంగా నడుస్తుండగా, తాజాగా మంగళవారం మరో ఐదింటిని ఏర్పాటు చేసింది. చింతపల్లిలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, చండూరులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తిప్పర్తిలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, శాలిగౌరారంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు.
దామరచర్లలోనూ సేవలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 5క్లినిక్‌లలో 493 మంది వైద్య సేవలు పొందారు. అందులో 132 మంది వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించుకున్నారు. అనంతరం డాక్టర్లు మందులు అందించారు. అవసరం ఉన్నవారిని పెద్దాస్పత్రికి రెఫర్ చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా క్లినిక్‌లను ఏర్పాటు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్12(నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిని బలోపేతం చేయడం, అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడం, అందుకోసం ప్రత్యేకంగా టీ హబ్‌ను ఏర్పాటు చేయడం, ఖరీదైన శస్త్రచికిత్సలను నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టారు. గ్రామీణ స్థాయి వరకు ప్రభుత్వ సేవలను విస్తరించడంలో భాగంగా బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు ఏర్పాటు చేశారు. అన్ని పీహెచ్‌సీల వరకు వైద్యుల పోస్టులన్నీ భర్తీ చేసి నిరంతర వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఇదే క్రమంలో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు.
ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటికే నిర్వహిస్తున్న కొన్ని యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో వారంలో ఒక రోజు ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు. మార్చి 8 నుంచి ప్రతి మంగళవారం మహిళలకు చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో తొలిదశలో నల్లగొండలోని మాన్యంచెల్క, వేములపల్లి, మర్రిగూడ, నిడమనూరు, కట్టంగూర్, డిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చారు. వీటన్నింటిలోనూ ప్రతి వారం అందిస్తున్న ఎనిమిది రకాల వైద్య సేవలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. దాంతో మరిన్ని కేంద్రాలకు వీటిని విస్తరిస్తూ వైద్యరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం నుంచి జిల్లాలోని మరో ఐదు చోట్ల మహిళ కోసం వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. చండూరు, తిప్పర్తి, చింతపల్లి, శాలిగౌరారం, దామరచర్ల పీహెచ్‌సీల్లో ఆరోగ్య మహిళ సేవలకు శ్రీకారం చుట్టారు.
మంగళవారం ప్రారంభమైన ఐదు కేంద్రాల్లో తొలిరోజే మంచి స్పందన కనిపించింది. మొత్తం 493 మంది వైద్య సేవల కోసం వచ్చారు. వీరిలో అవసరాన్ని బట్టి 132 మందికి వివిధ రకాల పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. తిప్పర్తిలో 108 మంది, దామరచర్లలో 76, చండూరులో 101, చింతపల్లిలో 97, శాలిగౌరారంలో 111 మంది మహిళలు సేవలను వినియోగించుకున్నారు. ఇప్పటికే నిర్వహిస్తున్న కేంద్రాలతో సమానంగా నూతన కేంద్రాల్లోనూ మహిళలు రావడం విశేషం.
మొత్తంగా జిల్లాలోని 11 మహిళ ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం 1,111 మంది మహిళలు ప్రత్యేక సేవలను వినియోగించుకోగా అందులో 376 మంది నుంచి శాంపిల్స్ సేకరించి టీహబ్‌కు పరీక్షల కోసం పంపినట్లు జిల్లా మహిళా ఆరోగ్య సేవల ఇన్చార్జి డాక్టర్ అరుంధతి వెల్లడించారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ప్రత్యేకంగా 8 రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ప్రత్యేకంగా ఎదుర్కొనే బ్రీస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు థైరాయిడ్, మైక్రోన్యూట్రిషన్ డెఫిషియెన్సీ, విటమిన్-డి, సీబీపీ లాంటి కీలకమైన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగానే ఇలాంటి పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తులో ప్రమాదకర వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని అరుంధతి సూచించారు.
ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
మాల్, సెప్టెంబర్12 : రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చింతపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి మంగళవారం మహిళల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, సర్వేకల్, రొమ్ము, క్యాన్సర్ల వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, నట్వ గిరిధర్, నరేందర్‌రావు, వింజమూరి రవి, కొండల్నాయక్, అశోక్, సుమతిరెడ్డి, రామారావు, మల్లేశ్, నరేంద్రప్రసాద్, విజయ్, బాల్సింగ్, ఖాలేద్, ఆంజనేయులు, శ్రీనుయాదవ్తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరోగ్య మహిళా క్లినిక్‌లను సద్వినియోగం చేసుకోవాలి
శాలిగౌరారం, సెప్టెంబర్ 12 : మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళా క్లినిక్ మంచి కార్యక్రమని, పేదలకు ఇది ఎంతో ప్రయోజనకరమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం శాలిగౌరారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య క్లినిక్‌ను డీఎంహెచ్ఓ కొండల్రావు, శాలిగౌరారం జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల్లో క్యాన్సర్, తదితర పెద్ద వ్యాధి లక్షణాలను ముందే గుర్తించి వారికి తగిన చికిత్స అందించేందుకు మహిళా ఆరోగ్య క్లినిక్‌లు ఎంతో దోహద పడుతాయన్నారు. మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రతి అధికారి మెలగాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో రెండో విడుతగా 5 మహిళా ఆరోగ్య క్లినిక్‌లను ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం పీహెచ్‌సీలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లతో మాట్లాడారు. మహిళలను మహిళా ఆరోగ్య క్లినిక్‌లను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. అక్కడ ఉన్న గర్భిణులతో మాట్లాడి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. వారి చేతిలో ఉన్న రిపోర్టులను పరిశీలించారు.
మహిళల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు
దామరచర్ల, సెప్టెంబర్ 12: మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కె. వీరకోటిరెడ్డి అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సర్కారు దవాఖానలు బలోపేతమయ్యాయని, పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. ప్రతి మంగళవారం మహిళలకు ఇద్దరు మహిళా వైద్య నిపుణులతో పరీక్షలు జరిపి ఉచితంగా చికిత్స అందిస్తామని మండల వైద్యాధికారి నాగేశ్వర్రావు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీనాథ్, ప్రియాంక, శిరీషా, నస్రీం సుల్తానా, ఎంపీడీఓ జానయ్య, ఎంపీటీసీ సోము సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆంగోతు హాతీరాం, బాల సత్యనారాయణ, కొనకంచి సత్యనారాయణ, జి.కృష్ణయ్య, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.