నల్లగొండ, జూన్ 18 : కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ హాళ్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 141 రైతు వేదికలు ఉండగా, గతంలో ఆరింటిని వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాలుగా మార్చిన రేవంత్ సర్కార్.. మంగళవారం మరో 25 రైతు వేదికలను కాన్ఫరెన్స్ హళ్లుగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆయా కేంద్రాలను వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాలుగా మార్చే ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.
రైతులకు సాగులో మెళకువలు, శిక్షణ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ సెంటర్లుగా మారుస్తుంది. ఇప్పటికే దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ నియోజక వర్గంలోని చందుపట్ల, నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం రైతు వేదికల్లో ఎల్సీడీ, వీడియో కెమెరాలు, సౌండ్ సిస్టమ్ తదితర సౌకర్యాలు కల్పించి వీడియో కాన్పరెన్స్ కేంద్రాలుగా మార్పు చేసింది. వీటిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్చి 6న ప్రారంభించారు. తాజాగా జిల్లాలోని మరో 25 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి జిల్లా వ్యవసాయ అధికారికి జాబితాను పంపించారు. చింతపల్లి, చందంపేట, డిండి మండలం గుండ్లపల్లి, కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల, నేరేడుగొమ్ము, పీఏపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడ్గులపల్లి మండలం చిరుమర్తి, చండూరు మండలం బంగారిగడ్డ, మర్రిగూడ, నాంపల్లి, అనుముల మండలం కొత్తపల్లి, గుర్రంపోడు మండలం కొప్పోలు, నిడమనూరు, తిరుమలగిరి, పెద్దవూర, చిట్యాల మండలం ఉరుమడ్ల, నారట్పల్లి, కట్టంగూర్, కేతేపల్లి, కనగల్, నల్లగొండ మండలం దోమలపల్లి, శాలిగౌరారం రైతు వేదికలను రైతు వీడియో కాన్ఫరెన్స్ కేంద్రాలుగా మార్చనున్నారు.