బీఆర్ఎస్ హయాంలో భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన ధరణితో ప్రజలకు కనీవిని ఎరుగని రీతిన సమస్యలు పరిష్కారం కాగా తామేదో సాధిస్తామంటూ పేరు మార్చి తీసుకువచ్చిన భూభారతితో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిది శూన్యం. ధరణిలో ఏదో గోల్మాల్ జరిగింది.. మేం రైతులను ఉద్ధరిస్తాం.. పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామంటూ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి జూన్ 20 వరకు రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అయితే రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు అతీగతీ లేకపోవడం గమనార్హం. జిల్లాలో రైతుల నుంచి 47,478 దరఖాస్తులు వస్తే అందులో పరిష్కారమైనవి కేవలం 864 మాత్రమే. కాగా 46,614 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయంటే భూభారతి పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది.
సూర్యాపేట, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకిచ్చిన హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పథకాలను సైతం కొనసాగించలేని దుస్థితిలో ఉంది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటూ ప్రతిన బూనిన రేవంత్రెడ్డి 21 నెలల పాలనలో పేర్లు మార్పు తప్ప, ప్రజలకు ఒరగింది శూన్యం. రైతుబంధును రైతు భరోసాగా మార్చి నీరు గార్చారు.
రైతులకు దన్నుగా ఉన్న ధరణి పేరు మార్చి ఏదో కొత్తగా కనుగొన్నట్లు బిల్డప్ ఇస్తున్నా అవే మాడ్యుల్స్ ఉండడం గమనార్హం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ తీసుకువచ్చింది. పోర్టల్ ఇంప్లిమెంట్లో అవసరమైన మాడ్యూల్స్ తీసుకువచ్చి దాదాపు 98 శాతం రైతుల రికార్డులను ఆన్లైన్ చేయడంతో పాటు పక్కా పాసు పుస్తకాలు వచ్చాయి. వందల సంవత్సరాల నుంచి ఉన్న రికార్డులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల చర్యలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి తయారు చేసిన రికార్డులను ధరణితో ఆన్లైన్ చేయడానికే అనేక సమస్యలు అడ్డు వచ్చాయి.
అయినప్పటికీ ఎప్పటికప్పుడు మాడ్యూల్స్ తెచ్చి భూ సమస్యలను పరిష్కరించారు. మిగిలిన రెండు శాతం మాత్రం కోర్టు కేసులు, వ్యక్తిగత పంచాయితీలు తదితర కారణాలతో నిలిచిపోయాయి. మిగిలి ఉన్న రెండు శాతం సమస్యలను ఏదో ఒక రకంగా పరిష్కరించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో పేరు మార్చి భూ భారతిని తీసుకువచ్చింది. అయితే పేరు మార్చినా పోర్టల్లో కొత్తగా ఎలాంటి మాడ్యుల్ రాలేదని , ఓపెన్ చేస్తే పాత మాడ్యూల్స్ మాత్రమే కనిపిస్తున్నాయని మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు.
రెండు నెలలు గడిచినా సాధించిది శూన్యం..
భూభారతితో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని భూ సమస్యలను తాము పరిష్కరిస్తామంటూ చేపట్టిన కార్యక్రమం అభాసుపాలైంది. జూన్ 2 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సుల పేరిట రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 18 రోజుల్లో వివిధ సమస్యలపై రైతులు 47,478 దరఖాస్తులు చేస్తే ఇప్పటి వరకు కేవలం 864 మాత్రమే అది కూడా సర్వసాధారణంగా చేసేవే ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని వాటిని తాము పరిష్కరిస్తామని చెప్పి, మరి ఎందుకు చేయడం లేదో ఆ దేవుడికే ఎరుక. కోర్టు కేసులు, మిస్సింగ్ సర్వే నంబర్లు, వ్యక్తిగత పంచాయితీలు తదితర కారణాలతో నిలిచిపోయిన వాటిని పరిష్కరించాలంటే ఎవరి తరం కాదు.
సర్వే అంటే ఘర్షణలే..
ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తుల్లో అత్యధికంగా 80శాతం మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులే ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే తలకు మించిన భారమేనని అధికారుల ద్వారా తెలిసింది. అలాంటి వాటిని పరిష్కరించేందుకు ఆయా సర్వే నంబర్లలో ఉన్న రైతుల నుంచి సహకారం అందడం లేదని, నోటీసులు ఇస్తే తీసుకోవడం లేదని తెలిసిం ది. ఏండ్ల తరబడి తాము ఉన్న భూమి తమది కాదు… వేరే చోటకు వెళ్లాలని చెబుతారేమోననే భయాందోళనలకు రైతులు గురవుతుండటం… కొన్ని సార్లు రైతుల మధ్య ఘర్షణలకు తావిస్తుందని చెబుతున్నారు.
దీంతో మిస్సింగ్ సర్వే నంబర్ దరఖాస్తులకు ఆయా సర్వే నెంబర్లలో ఎక్స్టెంట్ లేక అధికారులు, ఉద్యోగులు వాటిని ఎలా చేయాలి… ఏం చేయోలా అర్థం కావడం లేదు. ఈ లెక్కన ధరణిని భూ భారతిగా పేరు మార్చినా ఎలాంటి ఫాయిదా లేదని తెలుస్తోంది. ధరణితో 98 శాతం సంపూర్ణం కాగా మిగిలిన రెండు శాతాన్ని కూడా పరిష్కరించేందుకు ధరణితోనే ఇంకా ఏమైనా చేయవచ్చా అనే ఆలోచన చేయకుండా ఏదో కొత్తగా సాధిస్తున్నట్లు పాత ఆప్షన్లతోనే భూభారతి తీసుకువచ్చినా అది సాధించింది శూన్యం… సాధించేది కూడా శూన్యమేనని రెవెన్యూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.