రెండో విడత రుణమాఫీలోనూ స్పష్టత కరువైంది. ఎవరికి రుణమాఫీ వర్తించింది.. వర్తించకపోతే ఎందుకు వర్తించలేదు.. దానికి కారణాలేంటన్న దానిపై రైతుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. పైకి ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తున్నది. ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింప చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పదేపదే మీడియా ఎదుట చెప్తున్నారు.
గ్రౌండ్ లెవల్లోమాత్రం కుటుంబం ప్రతిపాదికనే రుణమాఫీ చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. దాంతో రైతుల్లో తీవ్ర ఆయోమయం నెలకొని బ్యాంకు ఉద్యోగులతోపాటు వ్యవసాయ శాఖ అధికారులతో వాదనకు దిగుతున్నారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బ్యాంకులు, సొసైటీలు పెద్ద సంఖ్యలో రైతులతో కిక్కిరిసిపోయాయి. రుణమాఫీ జాబితాలో తామున్నామో, లేమో తెలుసుకునేందుకు రైతు క్యూ కట్టారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి విడుత లక్ష రూపాయల రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. దీనిపై రైతుల నిలదీతలు, అధికారుల వివరణలు ఓ వైపు కొనసాగతుండగా, మరోవైపు రెండో విడత రుణమాఫీలో లక్షన్నర వరకు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడుత మాదిరిగానే రెండో విడతలోనూ కుటుంబం ఆధారంగానే రుణమాఫీని వర్తింప చేసింది.
రేషన్‌కార్డు ప్రమాణికంగా ఒక కుటుంబంలో ఎంత మంది సభ్యులు రుణం తీసుకున్నా గరిష్టంగా లక్షన్నర వరకు మాఫీ చేశారు. దాంతో రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికీ మాఫీ కాలేదన్న అసంతృప్తిలో రైతులు కనిపిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో విడుతలో మొత్తం 82,020 కుటంబాలకు గానూ రూ.947.43 కోట్ల రుణాలు మాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో రెండు విడుతల్లో కలిపి కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,57,162 మంది రైతులకు గానూ రూ.1,880.25 కోట్లు మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి.
వాస్తవానికి ప్రభుత్వం చెప్పిన విధంగా పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ అమలు చేస్తే ఐదు లక్షల మంది రైతుల వరకు లబ్ధిదారులుగా ఉంటారని అంచనా. ప్రభుత్వం కొర్రీల వల్ల కనీసం రెండు లక్షల మంది అర్హులైన రైతులు రుణమాఫీకి దూరమవుతున్నట్లు అనధికారిక అంచనా. రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకోవడంతో కుటుంబానికి గరిష్ట లబ్ధి రెండు లక్షలే కలుగనుంది. ఇక రేషన్‌కార్డులు లేని వారికి ప్రస్తుతం రుణమాఫీ వర్తించడం లేదు.
తర్వాత గ్రామాలకు వచ్చి అధికారులు విచారణ జరిపి రుణమాఫీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇదే సమయంలో ఆధార్ కార్డులను, బ్యాంకు అకౌంట్లు, పాస్‌పుస్తకాలతో లింక్ చేసే క్రమంలో జరిగిన పొరపాట్లతోనూ కొందరు రుణమాఫీకి దూరం అవుతున్నారు. వాటిని సరిచేసే వ్యవ్యస్థ నేటికీ అందుబాటులోకి రాకపోవడంతో సంబంధిత రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
డీసీసీబీలో 20శాతం మంది దూరంగా…
నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అర్హులైన రైతుల్లో లక్షన్నర రుణమాఫీకి 20 శాతం మంది దూరం అవుతున్నట్లు అంచనా. వాస్తవంగా డీసీసీబీ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 23వేల మంది వరకు లక్షన్నర రుణమాఫీకి అర్హులుగా బ్యాంకు అధికారులు అంచనా వేశారు. వారిలో 80శాతం మంది రుణమాఫీ పరిధిలోకి వస్తున్నట్లు అనధికారిక సమాచారం. వారి కోసం రూ.95కోట్లు రుణమాఫీ కింద జమ అయినట్లు తెలిసింది.
డీసీసీబీ పరిధిలో తొలి దశలోనూ మొత్తం 72వేల మంది రూ.316కోట్ల వరకు లక్ష రుణమాఫీకి అర్హులుగా ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తే అందులో 33,913 మంది కోసం రూ.143 కోట్ల రుణమాఫీ మాత్రమే వచ్చింది. రెండో దశలోనూ అలాగే కోతలు పడడంతో సొసైటీల్లోనూ రైతుల్లో ఆందోళన నెలకొంది. వీటిపై వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం చెబుతున్నా వారి వద్ద కూడా సరైన సమాధానం లభించడం లేదన్నది మెజార్టీ రైతుల అభిప్రాయం.
జిల్లా కార్యాలయానికి రైతుల క్యూ
రుణమాఫీ కాని రైతులు ఎందుకు కాలేదో తెలుసుకునేందుకు నల్లగొండలోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి తరలివస్తున్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో రైతులు కార్యాలయం వద్ద గుమిగూడారు. ఇందులో రేషన్ కార్డు లేకపోవడం వల్ల కొందరికి, ఆధార్ సీడింగ్‌లో తప్పుల వద్ద కొందరికి, ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి రుణాలు ఉండడం వల్ల మరికొందరికి రుణమాఫీ వర్తించ లేదని అధికారులు చెప్పారు. పైకి అందరికీ రుణమాఫీ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తుంటే.. ఇక్కడికి వచ్చాక రేషన్‌కార్డు ఆధారమని అధికారులు ఎలా చెప్తారని రైతులు నిలదీస్తున్నారు. గతంలో కేసీఆర్ సర్కారు చేసిన మాదిరిగానే అందరికీ భేషరతుగా రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు.