రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నది. 2014 తర్వాత ఇప్పటి వరకు నాలుగు సార్లు జాతర జరుగగా సర్కారు రూ.7.14 కోట్లు ఇచ్చింది. ఆలయం ద్వారా మారు రూ.3 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం రూ.10 కోట్లకుపైగా నిధులతో పెద్దగట్టులో శాశ్వత అభివృద్ధి పనులతోపాటు వసతులు కల్పించారు. త్వరలో జాతరకు ప్రభుత్వం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉన్నది. ఆలయ ప్రాంతాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి కృషి చేస్తున్నారు. అక్కడ ఉన్న చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చి చర్యలు తీసుకుంటున్నారు.
సూర్యాపేట, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ నానా అవస్థలు పడి అష్టకష్టాలతో లింగన్న దర్శనం చేసుకొని వెళ్లేవారు. నాటి ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో జాతరలు జరిపేందుకు ఐదు నుంచి పది లక్షల రూపాయలు రావడమే గగనంగా ఉండేది. అందులోనూ తాత్కాలిక పనులు చేపట్టి అత్యధికంగా స్వాహా చేసేవారు. కానీ.. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జాతరలకు అధిక నిధులిస్తూ భక్తులు అబ్బురపడేలా సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఈ క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయలు వస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారిగా 2015 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి సీఎం స్పెషల్ డెవల్మెంట్ ఫండ్ నుంచి రూ.2.10కోట్లు తీసుకొచ్చారు.
రెండేండ్ల తర్వాత 2017లో జాతరను మరింత వైభవోపేతంగా నిర్వహించేందుకు రూ.1.29 కోట్లు, 2019లో జరిగిన జాతరకు రూ.1.75కోట్లు, 2021లో రూ.2కోట్లు తీసుకొచ్చారు. నిధులు భారీగా తీసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికన సకల సౌకర్యాలు కల్పించడంతో జాతర ప్రాశస్తి మరింత వ్యాప్తి చెందింది. దాంతో భక్తుల రాక విపరీతంగా పెరిగి కానుకలు అదే స్థాయిలో వస్తున్నాయి. కొబ్బరికాయలు, తలనీలాలు, చెరుకు, సర్కస్ తదితర వేలాల్లో కూడా కోట్లలోనే ఆదాయం వస్తున్నది. నాలుగు జాతరలకు ప్రభుత్వం రూ.7.14 కోట్లు ఖర్చు చేయగా.. ఆలయానికి ఆదాయం రూ.3 కోట్ల వరకు వచ్చింది. ప్రతి జాతరకు వస్తున్న నిధులతో పెద్దగట్టు లింగమంతుల గుట్ట వద్ద పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగడంతో పాటు భక్తులకు ఆహ్లాదాన్ని పంచేలా తెలంగాణలోనే అతిపెద్ద కోనేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
లింగమంతుల స్వామి ఆలయం వద్ద భారీ కోనేరు జాతర సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. తాజాగా మంత్రి జగదీశ్‌రెడ్డి పెద్దగట్టును ఆనుకొని ఉన్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.2 నుంచి 3 కోట్ల రూపాయలు వెచ్చించే అవకాశం ఉంది. దీనికితోడు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తన నిధులు రూ.50 లక్షలు వెచ్చించి యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. దశాబ్దాల తరబడి ఉన్న లింగమంతుల స్వామి ఆలయ భూమి కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వస్తుండగా.. కలెక్టర్ నేతృత్వంలో భూ సర్వే చేయిస్తానని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి తాజాగా పలు హామీలు ఇచ్చారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో కోట్లాది నిధులతో సకల సౌకర్యాలు ఒనగూరి లింగమంతుల స్వామి జాతర ఘనంగా జరుగుతున్నది. ఫిబ్రవరి 5 నుంచి జరుగనున్న జాతరకు వచ్చే చివరి భక్తుడు కూడా సంతోషంగా వెనుదిరిగి వెళ్లేలా ప్రణాళికాబద్ధంగా సకల వసతులు కల్పిస్తాం. ఇప్పటికే కనీవిని ఎరుగని రీతిలో శాశ్వత సౌకర్యాలు కల్పించారు. ఫిబ్రవరిలో జరిగే జాతరకు మంత్రి అండదండలతో ఎలాంటి సమస్యలూ రాకుండా ఏర్పాట్లు చేస్తాం.
– కోడి సైదులు యాదవ్,
లింగమంతుల స్వామి ఆలయ పాలకవర్గ చైర్మన్