Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లాలంటే గతంలో ఇరుకైన రోడ్లు ఉండేవి. కొండపైన విశాలంగా లేకపోగా కొండ కింద 60 ఫీట్ల రోడ్లే ఉండేవి. వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తేవి. సీఎం కేసీఆర్ ఆలయాన్ని పునర్నిర్మించడంతో గుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కొండపైన నిర్మాణాలను 17.32 ఎకరాలకు విస్తరించగా.. కొండ చుట్టూ, కింద విశాలంగా రోడ్లు వేశారు. 200 ఫీట్ల వెడల్పుతో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, పచ్చని చెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాయగిరి నుంచి గుట్టకింద స్వామివారి పాదాల వరకు 120 ఫీట్ల వెడల్పుతో 5.4 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. వీటికి ఆర్అండ్బీ కింద రూ. 235.75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఒక్కప్పుడు రోజుకు 10 వేల మంది భక్తులు గుట్టకు రాగా ప్రస్తుతం 50 వేల మందికిపైనే దాటుతున్నది. ఎంత మంది వచ్చినా సౌకర్యవంతంగా రోడ్లు ఉండడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 9: గత ప్రభుత్వాలు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయాన్ని పట్టించుకోకపోవడంతో రోడ్లన్నీ ఇరుగ్గా ఉండేవి. దాంతో వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. ఆలయం చుట్టూ తిరగాలన్న రోడ్లు ఉండేవి కావు. గుట్ట చుట్టూ అడవే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సువిశాలమైన రోడ్లు, ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రోడ్లు, ప్రధాన కూడళ్లల్లో అందమైన సర్కిళ్ల నిర్మాణం, గుట్ట చుట్టూ తిరిగేందుకు ఆహ్లాదకరమైన వలయదారులు దర్శనమిస్తున్నాయి. 10 క్రితం గుట్టకు వెళ్లిన వాళ్లు ఇప్పుడు వెళ్తే తాము వచ్చింది యాదగిరిగుట్టకేనా అని ఆశ్చర్యపోవాల్సిందే.
200 ఫీట్ల వెడల్పుతో రోడ్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో 2014 తరువాత యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 2016 ఆక్టోబర్ 11న ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా మహాద్బుతంగా రూపుదిద్దుకున్నది. గతేడాది మార్చి 28న ఆలయం పునఃప్రారంభమై భక్తకోటికి స్వా మివారు దర్శనమిస్తున్నారు. ఒక్కప్పుడు రోజుకు 10 వేల మంది మాత్రమే వచ్చేది. రానురాను భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం శని, ఆదివారాలతో మిగతా సెలవుదినాల్లో రోజుకు 50 వేల పైగానే భక్తులు వస్తున్నారు. దాంతో భక్తుల రద్దీని పసిగట్టిన సీఎం కేసీఆర్ కొండచుట్టూ అద్భుతంగా, విశాలంగా రోడ్డును తీర్చిదిద్దారు. అప్పుడూ కేవలం 60 ఫీట్ల వెడల్పులో ఉండే రోడ్లు ప్రస్తుతం 200 ఫీట్ల వెడల్పు విస్తరించారు.
4.30 ఎకరాలలో ఆలయం
ఒక్కప్పుడు కేవలం 1.30 ఎకరాల్లోనే స్వామివారి ఆలయం ఉండేది. దాంతో భక్తులు ఆల యం చుట్టూ తిరుగాలంటే మాఢవీధులు లేని పరిస్థితి కానీ, ప్రస్తుతం ప్రధానాలయం 4.30 ఎకరాలలో ఆలయాన్ని నిర్మించి, చుట్టూ నలుమాఢవీధులను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్ట కొండపైన నిర్మాణాలను 17.32 ఎకరాల్లో విస్తరించారు.
Yadadri3
రూ. 235.75 కోట్లతో రోడ్లు విస్తరణ..
నాడు యాదగిరిగుట్ట ఆలయానికి రావాలంటే కంపచెట్లు, ముళ్ల పొదలను దాటుకంటూ రావాల్సి వచ్చేది. దాంతో పాటు ప్రధాన రోడ్డు కేవలం 60 నుంచి 80 ఫీట్లు మాత్రమే వెడల్పుతో ఉండేది. ప్రస్తుత ఆలయ పునర్నిర్మాణంలో యాదగిరిగుట్ట చుట్టూ రోడ్లకు మహర్దశ పట్టుకున్నది. ఆలయం ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న నేపథ్యంలో అదే రీతిలో ఆలయ చుట్టూ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ఆర్ అండ్ బీ నిధులు రూ.235.75 కోట్లు వెచ్చించారు. రాయగిరి నుంచి స్వామివారి పాదాల వరకు 5.4 కిలోమీటర్ల మేర 120 ఫీట్ల వెడల్పుతో ఫోర్ లైన్ రోడ్డు నిర్మించారు.
పాత గుట్ట చౌరస్తా నుంచి స్వామివారి పాదాల వరకు ప్రహరీతో కూడిన రోడ్డు చూడ ముచ్చటగా, ప్రమాదరహితంగా ఉంది. ఒక్కప్పుడు ఆలయం చుట్టూ తిరుగాలంటే రోడ్ల పరిస్థితి అంతంత మాత్రమే. కానీ ప్రస్తుతం స్వామివారి ఆలయం చుట్టూ 5.12 కిలోమీటర్లు మేర 200 ఫీట్ల వెడల్పుతో 6 లైన్లరోడ్లు వేశారు. దీంతో పాటు ప్రధాన కూడళ్ల వరకు అద్భుతమైన సర్కిళ్లు, సెంట్రల్ లైటింగ్, విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. తుర్కపల్లి మండల కేంద్రంలో నుంచి మల్లాపురం మీదుగా నిర్మించిన ఆరు లైన్ల రోడ్లు చూస్తే ఔరా అనక తప్పదు. కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకమైన రెండు ైప్లె ఓవర్లు భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా రవాణా ఇబ్బందుల లేకుండా రోడ్ల నిర్మాణాలు సాగాయి.