యాదాద్రి భువనగిరి, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు ఉంటే ఏమైనా చేసుకోవచ్చనే ధీమాతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకుంటూ కొందరు రియల్టర్లు ధనార్జనే ధ్యేయంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జోరుగా సాగిస్తున్నారు. దొడ్డిదారిలో వెంచర్లు, ఫామ్‌ల్యాండ్ ప్లాట్లు ఏర్పాటు చేస్తూ దందా నడిపిస్తున్నారు. జిల్లాలో అనేక చోట్ల ఈ తంతు నడుస్తోంది. ఇదే తరహాలో యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో వెలిసిన ఫ్యామ్ ల్యాండ్‌పై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం కలెక్టరేట్లో గ్రామ వార్డు మెంబర్లు మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు.
వంగపల్లిలో అక్రమ వెంచర్..
సాధారణంగా వెంచర్లు ఏర్పాటు చేయలాంటే గ్రామ పంచాయతీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ క్రమంలో ఆయా పాలక మండళ్ల పేరుతో మొత్తం స్థలంలో 10 శాతం భూమి రిజిస్ట్రేషన్ చేయాలి. అనంతరం తాగునీరు, డ్రెయినేజీ, రోడ్ల నిర్మాణం చేపట్టాలి. అప్పుడే వెంచర్ల ఏర్పాటు చేసి.. ప్లాట్లు విక్రయించేందు కు అనుమతులు లభిస్తాయి. కానీ ఇవేమీ లేకుండానే ఫామ్ ల్యాం డ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలుస్తున్నాయి. వంగపల్లిలో సర్వే నంబర్ 231లో నాలుగెకరాల భూమిలో ఫామ్ ల్యాండ్ వెంచర్ వేశారు. రైతుల వద్ద నుంచి భూములు కొంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. కమర్షియల్ అమ్మకాలు చేపడుతున్నారు.
నాలా కన్వర్షన్ చేయకుండానే, డీటీసీపీ అప్రూవల్ లేకుండానే ఫామ్ ల్యాండ్ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వ్యవసాయ భూమి అయినా ఐదు గుంటల్లోపు రిజిస్ట్రేషన్లను కమర్షియల్‌గానే పరిగణించాలనే నిబంధన ఉన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. రియల్టర్లు గుంటల్లో భూములు రిజిస్ట్రేషన్ చేయిం చి.. గజాల్లో ధరను ఖరారు చేస్తున్నారు. కాగా అక్రమ వెంచర్‌తో స్థల రూపంలో గ్రామ పంచాయతీకి, వివిధ రకాల ఫీజుల రూపం లో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నది. ఈ దందాను రెవెన్యూ అధికారులు చూస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
రోడ్లు, ప్రహరీల నిర్మాణం..
సాగు భూముల్లో రోడ్లతో అక్రమ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. భూమిని కొద్ది మేర అభివృద్ధి చేసి పెట్టుబడికి రెండింతలు ఆదా యం పొందుతున్నారు. వ్యవసాయ భూముల్లో వాణిజ్య అవసరాలకు రోడ్లు, ప్రహరీలకు అనుమతి లేదు. ఒక వేళ భూముల్లో రోడ్లు వేసి, ప్రహరీలు కడితే వాణిజ్య భూమి కిందనే లెక్క. అలాంటి భూములకు నాలా కన్వర్షన్ తప్పనిసరి. కానీ వంగపల్లిలోని వీబీఆర్ డెవలపర్స్‌లో ఎక్కడికక్కడ రోడ్ల నిర్మాణం చేపట్టారు. సిమెంట్ పలకలతో కాంపౌండ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో గజానికి ఐదారు వేల చొప్పున విక్రేతలకు అంటగడుతున్నారు.
ఒక గుంట 121 గజాల చొప్పున అమ్ముతున్నారు. అందమైన బ్రోచర్లు, ఫ్లెక్సీలతో ప్లాట్లు అంటూ హడావుడి చేస్తున్నారు. రెండు గుంటలు కొంటే ఏకంగా ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. యథేచ్ఛగా జరుగుతున్న ఈ మాఫియా..రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాసులు కురిపిస్తుండగా, వారి మాటలు నమ్మి అమాయక జనం నిలువు దోపిడీకి గురవుతున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది.