నందికొండ, జూన్ 05 : నాగార్జునసాగర్ జలాశయంలో నీరు రోజురోజుకు అడుగంటుతూ డేడ్ స్టోరేజ్ 510 అడుగులకు చేరువైంది. గతేడాది ఆగస్టు నెలలోనే రిజర్వాయర్‌లోకి నీరు పుష్కలంగా రావడంతో క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేపట్టి 4 నెలల పాటు 612 టీఎంసీల నీటిని దిగువకు వృథాగా విడుదల చేశారు. రిజర్వాయర్‌లో పుష్కలంగా వచ్చి చేరిన నీటిని పోదుపుగా వాడుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో యాసంగి సీజన్లో పంటలకు నీరు అందించలేని పరిస్థితి తలెత్తింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం నీటి మట్టం 511.60 (134.4032 టీఎంసీలు). డేడ్ స్టోరేజ్ 510 అడుగులకు కేవలం అడుగన్నర (2.7342 టీఎంసీలు) మాత్రమే ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిని పొదుపుగా వాడి రెండు పంటలకు నీరు అందించింది. దీంతో ఎన్నడూ నీటి నిల్వలు కనిష్ట స్థాయిలో పడిపోలేదు. ప్రతి ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరు అందించింది.
2020లో 531.20 ( 170.4984 టీఎంసీలు)
2021లో 533.00 ( 174.0610 టీఎంసీలు)
2022లో 535.50 ( 179.0830 టీఎంసీలు )
2023లో 520.50 (150.1900) టీఎంసీలుగా బీఆర్ఎస్ పాలనలో ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సన్నర కాలంలో మే 5 తేదీ నాటికి
2024లో 504.60 ( 122.6854 టీఎంసీలు)
2025లో 511.60 ( 134.4032 టీఎంసీల) లతో డ్యామ్ నీరు డెడ్ స్టోరేజ్‌కి చేరువైంది.
కృష్ణా నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10 టీఎంసీలు, ఆంధ్రాకు 4 టీఎంసీల నీటిని కేఆర్ఎంబీ నిర్ణయించింది. కృష్ణనదిలో నీటిమట్టం 505 అడుగుల వరకు వాడుకోవచ్చునని తెలిపింది. కృష్ణ నది డేడ్ స్టోరేజ్ 510 అడుగులు కాగ దాని కంటే ఇంకా 5 అడుగులు దిగువకు నీటిని వాడుకునేలా కేఆర్ఎంబీ నిర్ణయం వెల్లడించింది. సీజన్లో కృష్ణా నదిలోకి సకాలంలో నీరు రాకపోతే ఈ ఏడాది ఎడమ కాల్వ కింద పంటల సాగు ప్రశ్నార్ధకం కానుంది. 510 కంటే నీటి మట్టం దిగువకు పోతే ఎడమ కాల్వకు త్రాగు, సాగుకు నీరు విడుదల చేయడానికి వీలు ఉండదు. ఇకనైన అధికార యంత్రాగం స్పందించి కృష్ణానదిలో నీటిని త్రాగునీటి అవసరాల సాకుతో ఆంధ్రాకు తరలించుకపోకుండా చర్యలు తీసుకోవాలని, కృష్ణానదిలో నీరు డెడ్ స్టోరేజ్ కంటె దిగువకు పోకుండా చూడాలని ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.