గరిడేపల్లి, డిసెంబర్ 4 : ఈ భూమి పరిమతం. కానీ, నానాటికీ పెరుగుతున్న జనాభా మాత్రం అపరిమితం. పరిమితమైన భూమిపై పెరుగుతున్న జనాభాకు అనువైన ఆహార ఉత్పత్తులను అందజేయడం కష్టతరం. ఇటీవలే ఐక్యరాజ్య సమితి వెలువరించిన అధ్యయన నివేదిక ప్రకారం 2050 నాటికి 900 కోట్లకు చేరునున్న ప్రపంచ జనాభాకు అనువుగా ఇప్పటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని 60 శాతం పైగా పెంచాల్సి ఉంటుంది. అయితే 1960లో మొదలైన హరిత విప్లవంతో దిగుబడులు గణనీయంగా పెరిగినప్పటికీ దాని సుస్థిరతను అంతగా సాధించుకోలేకపోయాం.
సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా రసాయన ఎరువులు వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అటువంటి అశాస్త్రీయ, అసహజ పద్ధతులు సహజంగానే నేలల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భూసారం తగ్గడంతో లక్షలాది హెక్టార్ల విస్తీర్ణంలో పంట భూములు బీడు బారుతున్నాయి. దీంతో రానురాను ఆహార ఉత్పత్తులు మరింత తగ్గిపోయి మనిషి మనుగడే కష్టతరమయ్యే అవకాశం ఉంది. అందుకే భూ ఆరోగ్యాన్ని మన కర్తవ్యంగా స్వీకరంచాలనేది నిపుణులు మాట.
ఇందులో భాగంగానే నేలల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ప్రతి డిసెంబర్ 5ను ప్రపంచ మృత్తికా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 2023వ సంవత్సరం మృత్తికా దినోత్సవానికిగాను ‘నేల, నీరు జీవితానికి ఒక వనరు’ అనే థీమ్‌ను ప్రకటించింది. నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా నేలల పరిరక్షణకు అనుసరించాల్సిన విధానాలపై ప్రత్యేక కథనం.
అనంతమైన జీవ వైవిధ్యానికి ఆరోగ్యకరమైన నేలలే పట్టుగొమ్మలు. ఒక ప్రాంతంలో ఉండే జీవ సమూహంలోని వ్యత్యాసాలను జీవ వైవిధ్యంగా పరిగణిస్తారు. నేలలో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. వానపాములు, కీటకాలు, ఎలికపాములు వంటి అనేక జీవరాశులతో ఇది నిర్ధారణ అవుతుంది. ఒక అంచనా ప్రకారం చదరపు మీటర్ వైశాల్యంలోని మంచి నేలలో వెయ్యి రకాల సూక్ష్మజీవుల జాతులు ఉండి జీవ వైవిధ్యానికి కారణమవుతున్నాయి.
నేలకు చేరిన కర్బన సమ్మేళనాలను అందులోని సూక్ష్మజీవులు వినియోగించుకుని పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. నేలలోని జీవవైవిధ్యం వలన అనేక ఉపయోగాలు కలుగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా పచ్చికబయళ్లను, అడవులను పంట భూములుగా మార్చడంతో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. పంటల ఉత్పాదకత తగ్గడం, ఆహార భద్రత దెబ్బతినడం, కాలుష్యం పెరుగడం, పర్యావరణంపై దృష్ప్రభావం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయంలోనూ మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉంది. సేంద్రియ సాగును ప్రోత్సహిస్తే కొంతవరకైనా మార్పు రానున్నది.